ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న 14 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల వల్ల రూ.1.14 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరనుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టుల్లో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, గ్రీన్ ఎనర్జీ కారిడార్, పట్టణ నీటిసరఫరా నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టు, గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ఉన్నాయన్నారు. విజయవాడలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు కదా? మీ స్పందనేమిటి? అని అడగ్గా... ‘ఇది మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయమైనా ప్రజల సంక్షేమం, ఉపాధి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటుంది’ అని బదులిచ్చారు. ‘కరోనా సమయంలో వివిధ దేశాల నుంచి 2.9 లక్షల మంది తెలుగు వారిని వెనక్కి తీసుకువచ్చాం. నేను వివిధ దేశాల్లో పర్యటించాను. తెలుగువారు లేని దేశాన్ని ఎక్కడా చూడలేదు. ప్రతిభావంతుల్ని అందిస్తున్న ఈ గడ్డను సందర్శించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను’ అని జైశంకర్ పేర్కొన్నారు.
* ఆత్మనిర్భర్ భారత్... బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోందని జైశంకర్ వెల్లడించారు. విజయవాడలో శనివారం సాయంత్రం జరిగిన ‘కేంద్ర బడ్జెట్-అవగాహన’ సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, భాజపా ఏపీ సహ బాధ్యుడు సునీల్ దేవధర్ పాల్గొన్నారు. విదేశాలకు మిర్చి ఎగుమతి చేసేందుకు ఉన్న అవరోధాలను తొలగించాలని కోరుతూ జైశంకర్‌కు మిర్చి వ్యాపారుల సంఘం ప్రతినిధులు వినతిపత్రాన్ని అందించారు.
ఇదీ చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్ధృతం పోరు