ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి తగిన నిధులివ్వాలని 15వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌లకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం దిల్లీలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌తో కలిసి తొలుత 15వ ఆర్థిక సంఘం సభ్యులు అనూప్ సింగ్, అజయ్ నారాయణ ఝా, అశోక్ లహరిలతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారు. అనంతరం 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్‌కే సింగ్‌తో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకూ నిధులివ్వాలని కోరినట్లు సమాచారం. అనంతరం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్‌లతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ నిధులను సిఫార్సు చేయాలని కోరారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుగ్గన భేటీ కానున్నారు.
ఇదీ చదవండి : 'జగన్‌ను రాజ్యసభ సీటు అడిగింది నిజమే'