రాష్ట్రంలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. విద్యుత్ మీటర్లతో రైతులపై ఎలాంటి భారం ఉండదన్నారు. ఈ విషయంపై.. తెదేపా లేనిపోని రాద్ధాంతం చేస్తోందన్నారు. విద్యుత్ మీటర్లను ఉచితంగానే బిగిస్తామని మంత్రి బాలినేని పేర్కొన్నారు.
ఉద్యోగుల డిమాండ్లపై సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్లు మంత్రి బాలినేని తెలిపారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లులను వైకాపా ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని.. వ్యతిరేకత తెలియచేస్తూ కేంద్రానికి లేఖ సైతం రాశామని మంత్రి బాలినేని వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
విద్యుత్ శాఖలో రూ.70 వేల కోట్ల రుణాలు ఉన్నాయని.. రుణాలను క్రమంగా చెల్లిస్తున్నామని మంత్రి బాలినేని తెలిపారు. బయటి మార్కెట్‌లో తక్కువకే దొరకడంతో జెన్‌కో కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించినట్లు వెల్లడించారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని.. అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బయట మార్కెట్‌లో విక్రయిస్తామని బాలినేని తెలిపారు. రాయలసీమ థర్మల్ ప్లాంట్ విక్రయించడం లేదని.. అవన్నీ అపోహలే అని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: