రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు (Rayalaseema Lift Irrigation Project)పై తెదేపా విధానమేంటో ఆ పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) చెప్పాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (minister anil kumar yadav) డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం రేగుతున్నా.. చంద్రబాబు ఇప్పటి వరకు నోరు మెదపడం లేదని, దమ్ముంటే బయటకు వచ్చి రాయలసీమ లిఫ్టు పై పార్టీ విధానమేంటో చెప్పాలన్నారు. వెనుకబడిన రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకూ నీరందించేందుకు రాయలసీమ లిఫ్టు ఏర్పాటు చేస్తుంటే చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.
తెలంగాణకు వంత పడుతున్నారు..
రాయలసీమ లిఫ్టు ఆపాలని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు,నేతలతో చంద్రబాబు సీఎంకు లేఖలు రాయించారని మంత్రి అనిల్ విమర్శించారు. జిల్లాల మధ్య చిచ్చు పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు, సోమశిల నుంచి ప్రకాశం జిల్లాకూ సాగునీరు ఇచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటుండగా.. ప్రకాశం జిల్లాకు సాగునీరు పోకుండా చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ... తెలంగాణ దేశం పార్టీగా మారిందన్న అనిల్.. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలే తెదేపా ఎమ్మెల్యేలు చెబుతున్నారన్నారు. రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ వంత పాడుతోందని దుయ్యబట్టారు.
నాడు ఎందుకు వ్యతిరేకించలేదు..
రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇప్పుడు వారికి అనుకూలంగా, తెదేపా ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడించడం దారుణమన్నారు. ప్రతి ప్రాంతం సమానంగా అభివృద్ది ఉండాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని.. దీనికోసమే రాయలసీమ లిఫ్టుపై ఏడాదిన్నర క్రితమే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో, బయట తెదేపా ఎమ్మెల్యేలు రాయలసీమ లిఫ్టును ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఇరుపక్షాల వాదనలు విన్నాకే ఎంపీ రఘురామ అనర్హతపై నిర్ణయం: స్పీకర్ ఓంబిర్లా