తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కేటీకే 6వ ఇంక్లైన్లో జరిగిన గని ప్రమాదంలో అర్ధరాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. బుధవారం సాయంత్రం సమయంలో.. గనిపైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. మధ్యాహ్నం షిఫ్టులో విధులకు వెళ్లి కప్పు కింద పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు కాతం నర్శయ్య, సలవేని శంకరయ్య మృత్యువాత పడ్డారు. కప్పు కూలకుండా దిమ్మలు అమర్చే పని చేస్తున్న సమయంలో హఠాత్తుగా పైకప్పు కూలి కార్మకులపై పడడంతో.. వారు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. పక్కనే ఉన్న సర్దార్ నర్శింగరావు స్వల్పగాయాలైయ్యాయి. ఓవర్ మెన్ మనోజ్ కుమార్ షాక్‌తో అస్వస్ధతకు గురైయ్యారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సింగరేణి రెస్కూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులైన కార్మికులను..... సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు శ్రమించి 8 మీటర్ల వరకూ పడిన కప్పు శిధిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు.
ఇద్దరు కార్మికులు మృత్యువాత పడడంతో గని వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న క్రమంలో.. ఆగ్రహంతో కార్మికులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలకు కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు సర్దిచెప్పి కార్మికుల మృతదేహాలను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
జరిగిన దుర్ఘటనపై మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేస్తూ..వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ఉత్పత్తిపై శ్రద్ద చూపే యాజమాన్యం రక్షణ గాలికొదిలేయడంతోనే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నయాన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
ఇవీ చూడండి: