రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు, ఈడీలు హాజరయ్యారు. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై చర్చ జరుగుతోంది. ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై ఆర్టీసీ ఎండీలు చర్చిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో... ఏపీ 2.64 లక్షల కి.మీలు మేర బస్సులను తిప్పుతోంది. ఏపీలో... తెలంగాణ 1.52 లక్షల కి.మీ.లు తిప్పుతోంది. తెలంగాణ కంటే ఏపీ అదనంగా 1.12 లక్షల కి.మీలు బస్సులను తిప్పుతోంది.
ఏపీ ఎన్ని కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో తిప్పితే... అన్ని కిలోమీటర్లు తెలంగాణ బస్సులు ఏపీ భూభాగంలో తిప్పాలి. కానీ... ఇంతకు ముందు రెండుసార్లు జరిగిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ఈ అంశం కొలిక్కి రాలేదు.
గత సమావేశంలో ఏపీని లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరారు. 55 వేల కి.మీ.లకు మించి తగ్గించుకోమని ఏపీ అధికారులు చెప్పారు. అధికారుల సమావేశం కొలిక్కివస్తేనే... ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల మధ్య సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది.