సీఎం జగన్‌కు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్షలు చేశారు. సుమారు రెండు నెలల క్రితం జిమ్ చేస్తుండగా ఆయన ఎడమ కాలుకు స్వల్ప గాయమైంది. వ్యాయామాలు చేసేటప్పుడు అది నొప్పి పెడుతుండటంతో వ్యక్తగత వైద్యుడి సలహా మేరకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకోవడానికి వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాలు మడమ భాగంతో పాటు కీళ్ల వద్ద పరీక్షలు చేశారు. వాటి నివేదికలు వచ్చేవరకు ముఖ్యమంత్రి జగన్ ఆసుపత్రిలోనే ఉన్నారు. కాలికి ఏమీ కాలేదని, బాగానే ఉందని... ఎలాంటి విశ్రాంతి అవసరం లేదన్నారు. కొన్ని రోజులు సాధారణ వ్యాయామాలు చేసుకోవాలని వైద్యులు సలహానిచ్చారు. అవి చేసేటప్పుడు కాలికి బ్యాండేజ్ ధరించాలని, షూ వేసుకోవద్దని సూచించారు. ఆసుపత్రి ఫిజియోథెరపిస్టు సమక్షంలోనే ఒక బ్యాండేజిని కాలికి తొడిగి చూపించారు. ఎంఆర్‌ఐతో పాటు రక్త, కొలెస్టరాల్ స్థాయి పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9.45 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన తిరిగి 11.50 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి స్వాగతం పలికారు. డాక్టర్ జీవీ రెడ్డి, రేడియాలజిస్టు డాక్టర్ సతీష్ ఎంఆర్‌ఐ పరీక్షలు చేశారు. సీఎం వెంట డాక్టర్ హరికృష్ణ తదితరులున్నారు.
ఇదీ చదవండి: