అమరావతే శ్వాసగా రాజధాని రైతులు చేపట్టిన మలి విడత మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన యజ్ఞాన్ని... అడ్డంకులను అధిగమించుకుంటూ రైతులు కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా 26వ రోజు .... పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం నుంచి యాత్రను ప్రారంభించారు. స్వామి రథానికి పూజలు చేసి శంఖం పూరించి నడక ప్రారంభించారు. అన్నదాతలకు కల్లుగీత కార్మికులు సంఘీభావం తెలిపారు. అమరావతి పరిరక్షణలో మేముసైతం అంటూ రైతులతో స్థానికులు పాదం కలిపారు.
అమరావతి యాత్రకు వస్తున్న ఆదరణను చూసైనా... ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజధాని రైతులు హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రులు... వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
భీమవరంలో అమరావతి రైతులకు రఘురామకృష్ణరాజు యువసేన మద్దతు తెలిపింది. భీమవరంలో అల్లూరి విగ్రహం వద్ద జైఅమరావతి అంటూ రైతులు నినదించారు. ఏకైక రాజధానికి సంఘీభావంగా తెలుగుదేశం, భాజపా, రైతు నాయకులు గళమెత్తారు.
శృంగవృక్షం చేరుకున్న రైతులకు వినూత్న స్వాగతం లభించింది. 33 వేల ఎకరాలు ఇచ్చినందుకు.... 33 వేల ఒత్తులు వెలిగించి హారతి పళ్లాలతో స్థానికులు అన్నదాతలను ఆహ్వానించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను నకిలీ అని ప్రచారం చేయడం తగదన్నారు. త్యాగధనులకు న్యాయం చేయాలని కోరారు. పెదఅమిరం నుంచి విస్సాకోడేరు మీదుగా 15 కిలోమీటర్ల మేర సాగిన అన్నదాతల యాత్ర వీరవాసరంలో ముగిసింది.
ఇవీ చదవండి: