దాదాపు నాలుగు దశాబ్దాలు జనజీవితంతో మమేకమై లక్షల అభిమానుల్ని సంపాదించుకున్న కవి, రచయిత, నాటకకర్త ఆత్రేయ. 1921 మే నెల ఏడో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడు గ్రామంలో జన్మించిన ఆత్రేయ తల్లిదండ్రులు సీతమ్మ, కృష్ణమాచార్యులు. అసలు పేరు కిళాంబి నరసింహాచార్యులు. చిన్నతనంలో చదువుపై శ్రద్ధ ఉండేది కాదు. రాయవెల్లూరులో ఇంటర్మీడియట్ చదివి, చిత్తూరులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ‘జమీన్ రైతు’ పత్రికలోనూ పని చేశారు. విద్యార్థి దశలో వామపక్ష భావాలుండేవి. ఒకసారి కమ్యూనిస్టు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. నాటకాల్లోనూ నటించేవారు.
ఏది రాసినా తనదైన బాణీ!
ఆత్రేయ సినీ జీవితానికి మూలాలు నాటకాల్లో ఉన్నాయి. ఆయన కలం పదును మొదట వ్యక్తమైంది నాటక సంభాషణల్లోనే. ఆత్రేయ చాలా నాటకాలు, నాటికలు రాసినా వాటిలో కొన్ని చిరస్మరణీయం. కాలదోషం పట్టని కచ్చితమైన సామాజిక విలువలకు అద్దంపట్టే పదునైన ఆయుధం ‘ఎన్‌జీఓ’. ‘గుమాస్తా’ పేరుతో చలనచిత్రమైంది. డబ్బు మహిమను తెలిపే నాటకం ‘కప్పలు’. మత విద్వేషాల నేపథ్యంలో హజ్రాబేగం కథ ఆధారంగా రాసిన నాటకం ‘ఈనాడు’. యుద్ధంపట్ల సహజ వైముఖ్యంతో రచించిన సందేశాత్మక నాటకం ‘విశ్వశాంతి’. దీనికి శ్రీశ్రీ ముందుమాట రాశారు. బెర్నార్డ్ షా రచన ‘ది బ్లాక్ గర్ల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ది గాడ్’ ప్రేరణతో ప్రతీకాత్మకంగా ‘గౌతమబుద్ధ’ రాశారు. ‘చావకూడదు’ నాటకం ప్రిస్ట్‌లే ‘ఇన్‌స్పెక్టర్ కాల్స్’కు అనుసరణ. ‘జాన్ జి. ఇర్విన్ ప్రోగ్రెస్’ను మూలంగా గ్రహించి ‘ప్రగతి’ నాటకం రచించారు. ఆత్రేయ నాటికలూ సమకాలీన సమస్యల్ని ఘాటుగా విమర్శించాయి. ‘ఎవరు దొంగ’ మౌలికమైన రచన. అత్యధిక ప్రదర్శనలు పొందింది. 1951లో ‘దీక్ష’ చిత్రంకోసం ‘పోరా బాబు పో’ గీతరచనతో ఆత్రేయ సినీరంగ ప్రవేశం చేశారు. సినిమా పాటకు జీవం పోశారాయన.
మార్పులు తెచ్చి..
ప్రజల నాడిని అద్భుతంగా పట్టుకున్నారు. భావం, భాష, శైలిలో మార్పులు తెచ్చి సినిమా పాటను సినిమా పాటగానే నిలబెట్టారు. ఆయన పాటకోసం నిర్మాతలు పడిగాపులు పడేవారు. ఆయన పాటలు, మాటల వల్ల విజయవంతమైన చిత్రాలెన్నో ఉన్నాయి. ఆత్రేయ వైవిధ్య భరితమైన పాటలు రాశారు. సన్నివేశాన్ని బలంగా రక్తికట్టించే పాటలెన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. యువతరాన్ని ఆకర్షించే శృంగార గీతాలనూ మనోహరంగా గుప్పించారు. ఆ రోజుల్లో ఆయన రాసిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాట పెద్ద సంచలనమే సృష్టించింది. ‘ఎక్కడున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా’ వంటి వియోగ గీతం వెలువరించినా, ‘ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేదు’ అని ప్రేమ తత్వాన్ని ప్రకటించినా ఆత్రేయది ప్రత్యేక బాణీ.
ఆవేదనతో ఆలపించినా..
మనసు లక్షణాల్ని అద్భుతంగా వ్యక్తీకరించిన అనేక పాటలను ఆత్రేయ రాశారు. ‘మనసు గతి ఇంతే’, ‘మనసు లేని బ్రతుకొక నరకం’, ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ వంటి పాటలు ఆయనను మనసు కవిగా నిలబెట్టాయి. ఆత్రేయ గొప్ప తాత్వికుడు. ‘అనుకున్నామని జరగవు అన్ని... అనుకోలేదని ఆగవు కొన్ని... జరిగేదంతా మంచికని... అనుకోవడమే మనిషి పని’ అన్నది ఆయన అందించిన గొప్ప జీవిత సందేశం. ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికెవరు సొంతము ఎంతవరకీ బంధము’ వంటి ఆలోచనాత్మకమైన గీతాలెన్నో రాశారు. నాటక రచన కాలం నాటి సామ్యవాద దృక్పథాన్ని అవసరమైన సందర్భాల్లో ప్రకటించారు. ‘చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో’ అన్నా, ‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్’ అని రాసినా, ‘కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని ఆవేదనతో ఆలపించినా ఆత్రేయలోని సామాజిక స్పృహ ధ్వనిస్తుంది.
తెలుగు వారికి తీపిగుర్తుగా...
ఆత్రేయ అలతి అలతి మాటల్లోనే అందమైన పాటల్ని మలిచారు. ‘మానూమాకును కాను రాయీ రప్పను కాను మామూలు మనిషిని నేను’, ‘మూడేముళ్లు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు’ మొదలైన పాటల్లో సాధారణ శబ్దాలనూ కవిత్వీకరించారు. ముద్దబంతి పూవులు మూగకళ్ల ఊసులు, తేటతేట తెలుగులు తెల్లవారి వెలుగులు, సెలయేటి నురగలు చిరుగాలి తరగలు వంటి అపూర్వ పదబంధాలు ఆత్రేయకే సొంతం. ఆయన శక్తిమంతమైన సంభాషణలు రాసిన చిత్రాలెన్నో ఉన్నాయి.అర్ధాంగి, తోడికోడళ్లు, ప్రేమ్‌నగర్ వంటివి ఆత్రేయ మాటలతో అజరామరమయ్యాయి. ఆత్రేయ వాగ్దానం చిత్రం నిర్మించారు. ‘కోడెనాగు’లో నటించారు. ‘పోయినోళ్లందరూ మంచోళ్లే... ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపిగురుతులు’ అన్న ఆత్రేయ 1989 సెప్టెంబరు 13న అస్తమించి తీపిగుర్తుగా మిగిలిపోయారు.
ఇదీ చూడండి:
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు