రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగాా సాగుతోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించాలంటూ.. వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో తెదేపా విజయం సాధించటం ఖాయమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని 15వ డివిజన్ తెదేపా అభ్యర్ధి జ్యోత్స్నతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. దోసెలు వేసి ప్రజలతో మమేకమయ్యారు. వైకాపా దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి తెదేపాకి ఓటు వేయాలని కోరారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలను అనుసరిస్తూ.. తిరుపతి నగరపాలక సంస్ధ అభివృద్దికి తామంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు.
తెదేపా అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మున్సిపాలిటీలోని 33 వార్డులో తెదేపా అభ్యర్థి మోడం సిద్ధప్ప ప్రారంభించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉంటుందని.. కానీ అధికార వైకాపా ఆ హక్కును కాల రాస్తోందని ఆయన ఆరోపించారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేస్తూ.. తమ పార్టీని గెలిపించాలంటూ అభ్యర్థించారు.
విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్యే ఆర్పీ భానూజ్ దేవ్ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు.. వైకాపా నుంచి తెదేపాలో చేరారు. వైకాపాలో తమకు అన్యాయం జరిగిందని.. అందుకే తెదేపాలో చేరినట్టు వారు తెలిపారు.
పేదల సంక్షేమం కోసం శ్రమిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించి.. నగరాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డులో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామిరెడ్డితో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండీ.. నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు