తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వానాకాలంలో వరిసాగు చేసిన రైతుల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. సాగు నుంచి ధాన్యాన్ని అమ్ముకునే(paddy procurement problems) వరకూ అడుగడుగునా వరి రైతులు నష్టపోతూనే ఉన్నారు. పాలమూరు జిల్లాలో ఈఏడాది సుమారు ఏడున్నర లక్షల ఎకరాల్లో వరిసాగైంది. పంటచేతికి వచ్చే వేళ.. చాలా చోట్ల సుడిదోమ దెబ్బతీసింది. దాన్ని నివారించేందుకు పురుగు మందుల కోసం వేలల్లో ఖర్చైంది. దీంతో పెట్టుబడులు భారీగా పెరిగాయి. దోమపోటు కారణంగా దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే కొనుగోళ్లు సాగక రైతు నానా అవస్థలు పడుతున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 16క్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేయగా... 14 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. నవంబర్లో 800లకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. ఎక్కడా కొనుగోళ్లు సాగడం లేదు. ఎక్కడ చూసినా వరికుప్పలు దర్శనమిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు, రహదారులు, కల్లాలు, వ్యవసాయ పొలాలు, గ్రామీణ రోడ్లు అంతటా రైతులు తెచ్చిన ధాన్యం రాశులుగా కనిపిస్తోంది. కోత కోసం నెల రోజులు గడిచినా కొనేదిక్కే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరికోతలు ప్రారంభమై నెలరోజులైనా ఎండలు లేకపోవడం వల్ల కోసిన ధాన్యం ఎండటం లేదు. నిర్ణీత తేమశానికి చేరుకోవడం లేదు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం లేకపోవడంతో కొనుగోళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ధాన్యాన్ని ఆరబెట్టడం, ముసురు, వానలు కురవడంతో తిరిగి కప్పిపెట్టడం వారం పదిహేను రోజులుగా రైతులకు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు పడటమే పనిగా మారింది. మరోపని చేసుకోలేక, పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.
కొన్నిచోట్ల వానలకు ధాన్యం మొలకెత్తి రైతులు ఇప్పటికే నష్టపోయారు. మరోవైపు ధాన్యం రంగు మారుతోంది. కేంద్రాలకు తెచ్చిన ధాన్యమే అమ్ముడు పోకపోవడంతో చాలాచోట్ల కోతలు సైతం ఆగిపోయాయి. ఓవైపు ఆరుగాలం శ్రమించి పండించిన పంట, మరోవైపు అనుకూలించని వాతావరణం నడుమ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా ప్రైవేటు అమ్ముకుందామన్నా మద్దతు ధర దక్కడం లేదు. నాణ్యతా ప్రమాణాలు, తేమశాతం పేరిట క్వింటాకు 1400 నుంచి 1500 రూపాయలు మాత్రమే ధాన్యం ధర పలుకుతోంది. పైగా రవాణా, కూలీ ఇతర ఛార్జీలు అదనపు భారం. కొన్నిచోట్ల ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదు. వానలకు భయపడి గత్యంతరం లేని పరిస్థితుల్లో మార్కెట్ లలో ఎంతో కొంతకు రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. కొందరు ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పడిగాపులు పడుతున్నారు.
పెరిగిన పెట్టుబడి, తెగుళ్లు, తగ్గిన దిగుబడి, కొనుగోళ్లలో జాప్యం, అనుకూలించని వాతావరణం కారణంగా వానాకాలంలో వరి పండించిన రైతు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికైనా వరి రైతుల సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి:
Amaravati Farmer's Mahapadayatra: రెండు రోజుల విరామం తర్వాత..ఇవాళ పాదయాత్ర మెుదలు