రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమజంట... ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేలింది. ఓ క్వారీగుంతలో విగతజీవులుగా ఆ ఇద్దరూ కనిపించారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదన్న మనస్థాపంతో ఆ ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండ బాలయ్యనగర్‌లో జరిగింది. ఎన్టీఆర్నగర్కు చెందిన విశాల్ (21).. అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన మైనర్ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇటీవలే ఇద్దరు ఇరుకుటుంబాల పెద్దలకు వారి ప్రేమ విషయం తెలియపరిచారు. వాళ్లు ఒప్పుకోకపోవటం వల్ల తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు శనివారం తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు విశాల్ మీదే అనుమానం ఉందన్నారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్ క్వారీలో రెండు మృతదేహాలు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఆ మృతదేహాలు ప్రేమజంటవేనని తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.