ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రెండు దశల్లో కొవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని లేఖలో ప్రస్తావించారు.
పాఠశాలలు పునః ప్రారంభం రోజే కోయిలకుంట్లలో ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో ఒత్తిడికి గురై బలవన్మరణం చెందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయుల పట్ల ముందుగానే అర్ధవంతమైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదన్నారు.
ఏపీలో దాదాపు 12,000 కంటే ఎక్కువ ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారని.. మార్చి 2020లో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ.. వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు లేవనే విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. గడిచిన 5 నెలల్లో, పాఠశాలలు, కళాశాలలు , విశ్వవిద్యాలయాలలో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు భరించారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితన్నారు. ఆకలి, అప్పుల సమస్యలు విద్యా రంగాన్ని ఎంతో బాధిస్తుండటం కలచివేస్తోందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేసారు.
బోధనా వృత్తి చేయలేక ఉపాధ్యాయులు కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారటం వంటి విషాద గాధలు ఎన్నో మీడియాలో చూస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్ తదనంతర పరిణామాలు వల్ల అనేక మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. భారతీయ సంస్కృతి, సమాజ విలువలను తీర్చిదిద్దే గురువుల గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన సీఎం జగన్ ప్రైవేటు విద్యా రంగంలో పనిచేసే సిబ్బందికి తక్షణ సహాయం అందించడం ద్వారా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.
ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు ప్రైవేట్ ఉపాధ్యాయులకు తోచిన సాయం అందించాయని.. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్!