దివిసీమ ఉప్పెన బాధితులకు తాత ఎన్టీఆర్ అందించిన సాయం ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. 43 ఏళ్ల క్రితం 1977 నవంబర్ 19 అర్థరాత్రి దివిసీమ ఉప్పెన ప్రళయానికి 83 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని గుర్తు చేశారు. 20 వేల మంది వరకూ చనిపోయిన ఈ ఘటనను ఇప్పటికీ ఏటా ఆ ప్రాంత ప్రజలు స్మరించుకుంటూనే ఉంటారన్నారు.
అప్పుడు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తన సామాజిక బాధ్యత విస్మరించకుండా ఎన్టీఆర్ సినీరంగంతో కలిసి జోలె పట్టి విరాళాలు సేకరించారు. వ్యక్తిగతంగాను ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారని లోకేశ్ తెలిపారు. రామకృష్ణ మిషన్, బేలూరు మఠం వారు 11 గ్రామాల్లో 1100 ఇళ్ళు కట్టిస్తుంటే వారికి ఎన్టీఆర్ పెద్దఎత్తున విరాళాలిచ్చి సహకారం అందించారన్నారు. తాతగారి ఆ మానవతా గుణమే తెలుగుదేశం పార్టీలో ఈనాటికీ నిలిచి ఉన్నందున ఆ స్ఫూర్తిని ఎప్పటికీ కాపాడుకుందామని పార్టీ శ్రేణులకు లోకేశ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 'టెక్నాలజీ ఫస్ట్' అనేదే మా పాలన మోడల్: మోదీ