తెలంగాణలో రెండో రోజు లాక్‌డౌన్ అమలవుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వ వెసులుబాటు కల్పించడంతో హైదరాబాద్ మహానగర రోడ్లపై రద్దీ నెలకొంది. నిత్యావసరాలు, ఇతర పనుల కోసం జనం పోటీపడ్డారు. అవసరం లేనిదే జనం బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు. మెహిదీపట్నం చెక్ పోస్ట్ , రైతు బజార్ వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సుమారు 60 వాహనాలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లలో బారులు తీరారు. మెహిదీపట్నం బస్టాండు వద్ద ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఆర్టీసీ సర్వీసులు పరిమితంగా నడుస్తుండటంతో ప్రైవేటు వాహనాల వారు ఇష్టారీతిన దోచుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఉదయం కిక్కిరిసింది. కూరగాయలు, నిత్యావసరాల కోసం జనం మార్కెట్‌కు బారులు తీరారు. భౌతికదూరం వంటి నిబంధనలు పూర్తిగా విస్మరించి... జనం కొనుగోళ్లు చేశారు. చార్మినార్‌లో రంజాన్ సందర్భంగా సందడిగా ఉండాల్సిన మార్కెట్ బోసిపోయింది. ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించడంతో తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సేవలు యథాతథంగా సడలింపు సమయం ముగియగానే ఆపేశారు. మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. రేపు ఉదయం 6 గంటల వరకూ మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి: