కరోనా కట్టడికి తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సడలింపులు ఇచ్చినప్పటికీ.. రైతుబజార్లు.. పూలు, పండ్ల మార్కెట్లు ఉదయం పదింటికే మూతపడ్డాయి. లాక్‌డౌన్ తొలిరోజు ఉదయం నుంచే నగరంలో హడావుడి కనిపించింది. అన్ని రైతుబజార్లు, మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన లాక్‌డౌన్ ప్రకటనతో.. వినియోగదారులు పది రోజులకు సరిపడా నిత్యావసరాలను కొనుక్కున్నారు. 4 గంటలే అనుమతివ్వడంతో పల్లెల నుంచి రావాల్సిన సరకు సమయానికి రాక.. గిరాకీ లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టోకు మార్కెట్ నుంచి సరకు తెచ్చుకుని బేరం మొదలు పెట్టేసరికే సమయం అయిపోతుందని వాపోతున్నారు.
బోసిపోయిన పూలమార్కెట్
నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల రైతులతో కళకళలాడే గుడిమల్కాపూర్ పూలమార్కెట్ బోసిపోయింది. సరకు అమ్ముడుపోకపోవడంతో పూలు పారబోసి వెళ్లారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం మంచిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్‌డౌన్ ఒకటే మార్గమని చెబుతున్నారు. సామాజిక బాధ్యతతో అందరూ ఆంక్షలు పాటించాలని సూచిస్తున్నారు.
జంట నగరాల్లో వారాంతపు సంతలు కూడా ఎత్తేశారు. లాక్‌డౌన్ తొలిరోజు కావడంతో రాజధానిలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు.
ఇదీ చదవండి: నిలిచిన ధాన్యం కొనుగోళ్లు..ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం