రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఎన్నిక జరగకుండా ఉండిపోయిన.. 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు నిన్న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించారు. పోలింగ్, లెక్కింపు సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లాలోని ఖాళీగా ఉన్న రెండు సర్పంచి స్థానాలు, నాలుగు వార్డు సభ్యులకు ఉప ఎన్నిక నిర్వహించారు. మొత్తం ఏడు స్థానాల్లో 5,683 మంది ఓటర్లు ఉండగా, 4,812 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 84.67 ఓటింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంట నుంచి పోలింగ్ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన మద్దతుదారులు హవా చాటారు.
- ఆత్రేయపురం మండలం లొల్ల సర్పంచి స్థానానికి తెదేపా మద్దతుదారు కాయల జగన్నాథం 545 ఓట్ల మెజారిటీతో జనసేన మద్దతుదారు తూము వరలక్ష్మీదేవిపై విజయం సాధించారు.
- రాజోలు మండలం మెరకపాలెం సర్పంచిగా గిడుగు వెంకటనారాయణప్రసాద్ విజయం సాధించారు. వైకాపా మద్దతుదారు అడబాల నారాయణప్రసాద్‌పై ఆయన 136 ఓట్ల మెజారిటీ సాధించారు.
- రాజవొమ్మంగి పంచాయతీ రెండో వార్డుకు సంబంధించి తెదేపా మద్దతుదారు ఈకా అచ్చిరాజు వైకాపా మద్దతుదారు కేదారి సత్యవతిపై 29 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
- పెద్దాపురం మండలం జి.రాగంపేట రెండో వార్డులో తెదేపా మద్దతుదారు పసల సుబ్బారావు తన సమీప ప్రత్యర్థి ఎన్.కల్యాణ్‌కుమార్‌పై 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- చింతూరు మండలం గంగన్నమెట్ట పంచాయతీ 7వ వార్డులో సీపీఎం మద్దతుదారు బొగ్గా కుమారి, వైకాపా మద్దతుదారు వేకా భద్రమ్మ పోటీలో నిలిచారు. ఇక్కడ 39 ఓట్లకు గాను 37 పోలయ్యాయి. దీనిలో మూడు చెల్లనవి ఉన్నాయి. దీంతో ఇరువురు అభ్యర్థులకు చెరో 17 ఓట్లు చొప్పున వచ్చాయి. విజేత కోసం లాటరీ వేశారు. దీనిలో వైకాపా మద్దతుదారు వేకా భద్రమ్మను విజయం వరించింది.
- ఆలమూరు పంచాయతీలోని 8వ వార్డుకు సంబంధించి వైకాపా మద్దతుదారు ఎలుగుబంట్లు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థిపై 93 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లాలోని పెదకాకాని పంచాయతీతో పాటు అచ్చంపేట మండలం అంబడిపూడి, సత్తెనపల్లి మండలం పాకాలపాడు, బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల, వినుకొండ మండలం శివాపురం పంచాయతీలతో పాటు 9 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యక్షంగా పాల్గొనడంతో ఎన్నిక రసవత్తరంగా జరిగింది.
- బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామ పంచాయతీలో బ్రహ్మనాయక్ 153 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
- వినుకొండ మండలం శివాపురం గ్రామ పంచాయతీలో సుబ్బమ్మ 442 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
- అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామ పంచాయతీలో స్వరాజ్యలక్ష్మి 159 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
- సత్తెనపల్లి మండలం పాకాలపాడు పంచాయతీలో సుజాతలక్ష్మి 427 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
- పెదకాకాని గ్రామ పంచాయతీలో 73.19 శాతం పోలింగ్ నమోదైంది. గోళ్ల స్వరూపరాణికి 7,797 ఓట్లు రాగా, మండే దివ్యకు 6,089 ఓట్లు వచ్చాయి. 1,708 ఓట్ల ఆధిక్యంతో స్వరూపరాణి గెలుపొందారు.
నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో.. ఆరు పంచాయతీ వార్డు సభ్యత్వాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. స్వల్ప వాదోపవాదాలు తప్ఫ. ప్రశాంతంగా ప్రక్రియ ముగిసింది. నాలుగు స్థానాలను వైకాపా మద్దతుదారులు దక్కించుకోగా.. రెండింటిని తెదేపా మద్దతుదారులు సొంతం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో...
కందుకూరు గ్రామీణ మండలంలోని నరిశెట్టివారిపాలెం పంచాయతీకి ఆదివారం నిర్వహించిన ఉప ఎన్నికలో తెదేపా మద్దతిచ్చిన ముప్పాళ్ల శ్రీనివాసరావు 197 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలుపొందారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లాలో ఖాళీగా ఉన్న పొన్నాం (శ్రీకాకుళం మండలం), ఓవీపేట (బూర్జ), తోకలవలస (రేగిడి), మెట్టూరు(కొత్తూరు), బుక్కూరు (పాలకొండ), తేలినీలాపురం (టెక్కలి) పంచాయతీల్లో సర్పంచ్, మూడు వార్డు సభ్యుల స్థానాలకు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఎన్నిక నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 7,243 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 74.04 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఓట్లను లెక్కించి విజేతలకు ప్రకటించారు. గెలుపొందిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం అర్బన్ జిల్లాలో నెల్లిమర్ల మండలం ఏటీ అగ్రహారం, భోగాపురం మండలం లింగాలవలస సర్పంచి స్థానాలకు, మక్కువ మండలం కాశీపట్నం ఒకటో వార్డు, ఎల్.కోట మండలం రేగ ఏడో వార్డు స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగ్గా.. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
- లింగాలవలస సర్పంచిగా బుగత లలిత, ఏటీ అగ్రహారం సర్పంచిగా మీసాల సూర్యకాంతం ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి: స్థానిక సంస్థల పోలింగ్ ప్రారంభం..