స్థానిక సమరంలో మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నామపత్రాల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. విశాఖలో జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి 84 వార్డులకుగాను 308 మంది అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు... 151 నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలి 35, పార్వతీపురంలో 46, సాలూరులో 48, నెల్లిమర్ల నగరపాలక సంస్థ పరిధిలో 34 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని స్థానాల్లో అవకాశం ఇవ్వక పలువురు వైకాపా నేతలు రెబల్స్‌గా బరిలో దిగుతున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గురువారం 72 నామినేషన్లు దాఖలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వైకాపా, తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు కోలాహలంగా సాగింది. ఏలూరు నగరపాలక సంస్థలో గురువారం 75 నామినేషన్లు దాఖలయ్యాయి. పురపాలికల్లో నరసాపురం 62, నిడదవోలు 6, కొవ్వూరు పరిధిలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగరపంచాయతీలో రెండో రోజు 20 మంది నామపత్రాలు దాఖలు చేశారు.
కర్నూలు జిల్లాలోని 9 పురపాలికల్లో గురువారం 179 నామపత్రాలు దాఖలయ్యాయి. కర్నూలు నగరపాలక సంస్థలో... 77 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కడప జిల్లా రాయచోటి పురపాలికలోని అన్ని వార్డులకూ.. నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. ఇవాళ ఊపందుకునే అవకాశం ఉంది. బద్వేలు పరిధిలో 41 నామపత్రాలు దాఖలయ్యాయి.
అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 2 రోజులు కలిపి 144 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఒక్కరు కూడా నామపత్రాలు సమర్పించలేదు. పురపాలికల్లో గుంతకల్లు 55, గుత్తి 21, తాడిపత్రి 52, కళ్యాణదుర్గం 46, రాయదుర్గం 23, ధర్మవరం 73, హిందూపురం 48, కదిరి 61 నామినేషన్లు దాఖలయ్యాయి. తాడిపత్రి 30వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆయన తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండీ... 'అమరావతి కోసం ప్రజలంతా ఏకం కావాలి'