అడవిలో ఉండాల్సిన చిరుతలు ఇటీవల తరచుగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనికి వేసవి తాపం ,లాక్‌డౌన్ కారణమని నిపుణులు చెబుతున్నారు.
చిరుత విశేషాలు
సగటు జీవిత కాలం - 12-17 ఏళ్లు
భారతదేశంలో చిరుతల సంఖ్య12,000-14,000ఉంటాయని అంచనా (2015 గణాంకాల ప్రకారం)
పులుల ఆవాస ప్రాంతాల్లో ఉన్న చిరుతలు -7,910
ఉమ్మడి ఏపీలో చిరుతల సంఖ్య 343 (ఇందులో దాదాపు సగం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయని అంచనా)
మగ చిరుత బరువు 50-75 కిలోలు ఉంటే ఆడ చిరుత బరువు 28-60 కిలోల వరకూ ఉంటుంది.
ఒక్కో చిరుత ఒక కాన్పులో 2-3 పిల్లల్ని కంటుంది. ప్రతి పది చిరుత పిల్లల్లో రెండు మాత్రమే పెరిగి పెద్దవుతాయి. మిగతావి ఇతర జంతువులకు ఆహారమవుతాయి.
ఏడాదిన్నర వయసునుంచే సొంతంగా జీవించేందుకు ప్రయత్నిస్తాయి.
జనావాసాల్లోకి ఎందుకొస్తున్నాయి?
* అటవీ ప్రాంతాలను ఆనుకుని కొత్తగా వెలిసిన జనావాసాల్లో లాక్‌డౌన్ కారణంగా జన, వాహన సంచారం తగ్గటం
* దట్టమైన అరణ్యాలతోపాటు కొండలు, గుట్టలు, పొదలు, చిట్టడవుల్లోనూ చిరుతలు మనగలవు. పట్టణీకరణ పెరగటంతో అవి తమ ఆవాసాలను కోల్పోతున్నాయి.
* వేసవిలో ఆహార వెతుకులాటలో చిరుతలు ఆవాసాల్ని దాటి బయటికొస్తున్నాయి.
* ఆకలిదప్పులను తీర్చుకొని తిరిగి ఆవాసాలకు చేరుకునే క్రమంలో దారితప్పి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి.
సంచారానికి ఆటంకం లేకపోవటమే
అనంతపురం, కడప జిల్లాల్లోని చిట్టడవుల్లోనూ, నల్లమల, తిరుమల, పాపికొండలు, ఉత్తరకోస్తాల్లో చిరుతలు అధికంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌తో వాటి సంచారానికి ఆటంకం లేకపోవటం, అటవీ ప్రాంతం వెలుపల కూడా వన్యప్రాణులకు అనుకూల వాతావరణం నెలకొనడంతో చిరుతలు తరుచూ బయటకొస్తున్నాయి. వీటివల్ల మనుషులకు ముప్పు వాటిల్లిన ఘటనలేవీ ఇటీవల కాలంలో చోటుచేసుకోలేదు. వాటిని రెచ్చగొడితేనే ప్రమాదం. - - నళిన్‌మోహన్, పీసీసీఎఫ్, వన్యప్రాణి సంరక్షణ విభాగం
నిశ్శబ్ద వాతావరణంతో
లాక్‌డౌన్‌తో అటవీ ప్రాంతాల తరహాల్లోనే బయట కూడా నిశ్శబ్ద వాతావరణం నెలకొనటంతో చిరుతలు బయటకొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాటి సహజ ఆవాసాల నుంచి దారి తప్పి వస్తున్నాయి. వాటిని చూసి భయపడాల్సిన పనిలేదు. వాటి జోలికి వెళ్లకపోతే చాలు.
- షమీమ్, జంతుశాస్త్ర ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం