తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ తీర్థం పుచ్చుకోవడంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పార్టీని వీడి తెరాసలో చేరే అంశంపై అనుచరులతో చర్చిస్తానని గురువారం రోజున రమణ తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. తెలంగాణ తెదేపా అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అయ్యేందుకే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన తెదేపా, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్‌తో చర్చలు..
గురువారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన రమణ.. పార్టీ మారడంపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో కలిసి... మంత్రి ఎర్రబెల్లి, ఎల్.రమణ సుదీర్ఘంగా చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన ఆయన.. తెరాసలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు వెల్లడించారు. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామని అన్నారని తెలిపారు.
ఆవిర్భావం నుంచి తెదేపాలోనే
రమణ తెలుగుదేశం సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. 1994లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి, 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2009 శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ తెదేపా అధ్యక్షునిగా రమణ కొనసాగుతున్నారు.
త్వరలోనే చేరిక!
ఇటీవల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. 2018లోనే ఆయన తెరాసలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా... పరిస్థితులు అనుకూలించలేదు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాస సీనియర్ బీసీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రమణతో చర్చలు జరిగాయి. రమణకు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సీనియర్, చేనేత వర్గానికి చెందిన ఆయనకు తెరాస సముచిత స్థానం కల్పిస్తుందని మంత్రి ఎర్రబెల్లి ఇతర నేతలు వెల్లడించినట్లు తెలిసింది.
స్తబ్ధుగా తెతెదేపా..
పార్టీ అధ్యక్షుడిగా రమణ రాజీనామాతో తెదేపా శ్రేణులు నిరుత్సాహంలో మునిగాయి. పార్టీకి ఇది మరింత దెబ్బ అని కొందరు భావిస్తున్నారు.