కృష్ణా నదిపై నిర్మిస్తున్న, నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) మరోమారు కోరింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్చీఫ్లకు బోర్డు సభ్యకార్యదర్శి లేఖలు చేశారు. అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారన్న ఫిర్యాదులతో పాటు బోర్డు పరిధి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులు, తదితరాల డీపీఆర్‌లు, వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. తాగు, సాగు నీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి నీటివిడుదల వచ్చిన నేపథ్యంలో తెలంగాణ అవసరాలను కూడా నివేదించాలని బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు మరో లేఖను తెలంగాణ ఈఎన్సీకి పంపింది.
తెలంగాణకు సంబంధించిన పాలమూరు- రంగారెడ్డి, డిండి సహా నల్గొండ జిల్లాలో ఇటీవల శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలతో పాటు జోగులాంబ ఆనకట్ట, సర్వేకు అనుమతించిన ఎత్తిపోతలు, వరదకాల్వలు డీపీఆర్‌లు, వివరాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడ్డాయి. వీటి పరిధిని కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంది. దీనిపై పలు దఫాలు చర్చలు జరిగాయి. కేంద్రానికి బోర్డులు ముసాయిదాలను పంపించాయి. అయితే ప్రాజెక్టులవారీగా కేటాయింపులు లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన తెలంగాణ.. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే చేయాలని కోరగా, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది.
దీనిపై చివరిసారిగా గత ఏడాది అక్టోబరులో కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ జరిగింది. ఇద్దరు సీఎంల అభిప్రాయాల తర్వాత, బోర్డుల పరిధులపై తామే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. బోర్డు ఛైర్మన్, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండకూడదని అందులో పేర్కొన్నారు.
ఇవీ చూడండి: