శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాను కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశించింది. సాగు, తాగు నీటి డిమాండ్ లేకపోయినా కేవలం విద్యుత్తు ఉత్పాదన కోసం శ్రీశైలం నీటిని వృథా చేయడమేమిటని కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో 56 టీఎంసీల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని వెల్లడించింది. ఫలితంగా రెండు రాష్ట్రాలు నీటి వాడకం వల్ల శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 95 టీఎంసీలకు పడిపోయిందని.. రెండు తెలుగు రాష్ట్రాలకు(KRMB a letter to telangana And andhra pradesh) రాసిన లేఖలో బోర్డు పేర్కొంది.
శ్రీశైలం జలాశయం దిగువన ఎలాంటి సాగు, తాగు నీటి డిమాండ్ లేకపోయినా కేవలం విద్యుత్తు ఉత్పాదన కోసం శ్రీశైలం నీటిని వృథా చేయడమేమిటని కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలూ విద్యుత్తు ఉత్పాదన చేస్తూ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారని నిలదీసింది. ఈ నీటి సంవత్సరంలో కేవలం అయిదు నెలలే గడిచాయని, ఇలా నీటిని వృథా చేస్తే రాబోయే రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని రెండు రాష్ట్రాలనూ హెచ్చరించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యుడు (విద్యుత్తు) ఎల్.బి.మౌంతాంగ్ రెండు రాష్ట్రాలకూ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు పంపిన ఈ లేఖలో ముఖ్యాంశాలు..
- అక్టోబర్ వరకు రోజువారీ నీటి గణాంకాలను పరిశీలిస్తే ఉభయ రాష్ట్రాల జెన్‌కో అధికారులు శ్రీశైలంలో రెండు జలవిద్యుత్తు కేంద్రాల్లో రోజూ విద్యుత్తు ఉత్పాదన చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవైపు నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టంతో నిండుగా ఉంది. శ్రీశైలంలోకి ప్రవాహాలు తక్కువగా వస్తున్నాయి. దీంతో సముద్రంలోకి పెద్ద ఎత్తున నీటిని వృథాగా వదిలేయాల్సి వస్తుంది.
- శ్రీశైలం జలాశయంలో అక్టోబరు 15న 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టంతో 215.80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. విద్యుత్తు ఉత్పాదనతో నవంబరు 18 నాటికి 94.910 టీఎంసీలకు (856.10 అడుగుల నీటిమట్టం) తగ్గిపోయింది. అక్టోబరు 19 నుంచి నవంబరు 10 మధ్య రెండు విద్యుత్తు కేంద్రాల్లో 608.77 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. 55.966 టీఎంసీల నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేశారు.
- శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీళ్లివ్వాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నీటి సంవత్సరంలో బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనా పంపలేదు. దీన్ని బట్టి సాగర్ నుంచి సాగు, తాగు అవసరాలకు నీళ్లు అక్కర్లేదని అర్థమవుతోంది. శ్రీశైలం నుంచి విద్యుత్తు కోసమే నీటిని విడుదల చేస్తూ పెద్ద ఎత్తున సముద్రంలోకి వృథాగా వదిలేశారు. గతంలో కృష్ణా బోర్డు 9, 12 సమావేశాల్లో చర్చించి సాగు, తాగునీటి అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఈ నీటి సంవత్సరంలో అక్టోబర్ వరకు అయిదు నెలలే గడిచాయి. ఇలా వృథా చేస్తూ పోతే ఈ నీటి సంవత్సరం రెండో అర్ధభాగంలో కొరతకు దారి తీయవచ్చు. రెండు రాష్ట్రాలు నీటి వృథాను ఆపండి. కేవలం విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయొద్దు’ అని లేఖలో(krmb latest news) పేర్కొన్నారు.
ఇదీచదవండి.
Central Team Tour: వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందం.. రేపటి నుంచి పర్యటన