కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర జల్‌శక్తిశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ జల వివాదాల చట్టం-195లోని సెక్షన్ 5(3)కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను అనుసరించి దీని కాలపరిమితిని 2021 ఆగస్టు 1 నుంచి మరో ఏడాది పొడిగిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్రం 2004 ఏప్రిల్ 2న ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేసింది.
అది ఆరేళ్లపాటు విచారణ కొనసాగించి 2010 డిసెంబరు 30న నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు జలవివాద చట్టంలోని సెక్షన్ 5(3)ని అనుసరించి 2011 మార్చి 29న మళ్లీ దరఖాస్తు చేశాయి. వాటిపై ఏడాదిలోపు ట్రైబ్యునల్ తుది నివేదికను కేంద్రానికి సమర్పించాలి. అయితే దానిపై వాదనలు ముగియకపోవడంతో కేంద్రం ఏటా ట్రైబ్యునల్ కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చింది.
2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టంలోని సెక్షన్ 89 ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్ కాలపరిమితిని పెంచి, దానికి కొత్తగా విధివిధానాలను ఖరారు చేయాలని చెప్పడంతో అందుకు అనుగుణంగా కేంద్రం దాని కాలపరిమితిని పెంచింది. 2020 జులై 23న కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన ఉత్తర్వుల్లోని విధివిధానాల ప్రకారం ట్రైబ్యునల్ 2021 ఆగస్టు ఒకటిలోపు తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇందుకు తమకు మరో ఏడాది సమయం కావాలని కృష్ణా ట్రైబ్యునల్ విజ్ఞప్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: