ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం జరగనుంది. కృష్ణా నదిపై కేంద్ర జల్‌శక్తిశాఖ గెజిట్ అమలుపై చర్చించనున్నారు. కేంద్ర జలశక్తిశాఖ జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. ఈలోగా అందుకు సంబంధించి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం ఇంకా బోర్డులకు అందలేదు. నిర్వహణ కోసం కావాల్సిన సమాచారం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్‌లోని కొన్ని ప్రాజెక్టులను రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమలు కార్యాచరణ దిశగా ఇప్పటివరకు జరిగిన కసరత్తు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం సహా అన్ని అంశాలపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ గురువారం సమీక్షించింది.
కేంద్రం గెజిట్ అమలుపై ఉపసంఘం
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై కేఆర్ఎంబీ(KRMB subcommittee meeting) సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం ఇటీవలే జలసౌధలో జరిగింది. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్కో అధికారులు ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చూడండి: ENC Letter : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ