కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జూన్ నాలుగో తేదీన సమావేశం కానుంది. కొత్త ఎత్తిపోతలను ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు 12వ సమావేశాన్ని జూన్ నాలుగో తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశ ఎజెండా అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది. ప్రాజెక్టుల డీపీఆర్లు, టెలిమేట్రీ ఏర్పాటు, బోర్డు బడ్జెట్ సంబంధిత అంశాలపై చర్చించాలని బోర్డు ప్రతిపాదించింది.
లేఖలు అందలేదు..
ఇప్పటివరకు రెండు రాష్ట్రాల నుంచి బోర్డుకు లేఖలు అందలేదు. అయినా జూన్ నాలుగో తేదీన బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపారు. ఎజెండాను తర్వాత చెప్తామని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదీ యజమాన్య బోర్డు ఇంఛార్జీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్చీఫ్లు, బోర్డు సభ్యులు పాల్గొంటారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా..
రెండు రాష్ట్రాల ఫిర్యాదులు, ప్రాజెక్టులు, టెలిమెట్రీ ఏర్పాటు, జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త నీటి సంవత్సరంలో జలాల వినియోగం సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ భావిస్తున్న నేపథ్యంలో బోర్డు సమావేశం కీలకంగా మారింది.
ఇదీ చదవండి: