అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. ఒక నియంతపై పుడమితల్లి బిడ్డలు సాగిస్తున్న పోరాటం నేటికి 500 రోజులకు చేరిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా అనాథగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ను అమరావతి రైతులు అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రాజధాని నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు.
ఆంధ్రుల కలల రాజధానిగా ఊపిరి పోసుకుంటున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని ఇక్కడే ఉంటుందని రైతులను, రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటనపై రైతులు, ఆడ బిడ్డలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. రైతులపై అక్రమ కేసులు పెట్టిన, మహిళలపై పోలీసులతో దాడి చేయించినా వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు చేస్తున్న పోరాటం తప్పక విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాను చేసిన పొరపాటున సరిదిద్దుకునే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి రాష్ట్ర ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు.
పోరాటం ఆగదు: గల్లా
అమరావతి రాజధాని కోసం నిరంతరాయంగా పోరాడుతున్న రైతులు, మహిళలకు తెదేపానేత గల్లా జయదేవ్ అభినందనలు తెలిపారు. పోలీసు దాడులు ఎదుర్కొని రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు. 3 రాజధానుల ప్రకటన ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని గల్లా స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా పార్లమెంటులో తన గళం వినిపిస్తానన్నారు.
ఇదీ చదవండి: 'త్యాగం నిరుపయోగం కాదు.. అమరావతి శాశ్వతం'