తెలుగులోగిళ్లు పండుగ శోభను సంతరించుకున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ వినాయక చవితి. భూదేవంత అరుగు.. ఆకాశ మంత పందిళ్లు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, ఎలాంటి వారిచేతనైనా డ్యాన్స్ చేయించే హుషారైన సంగీతం.. ఇలా ఒకటా రెండా.. గణనాథుడి ఉత్సవాలు గుర్తొస్తే.. ఎలాంటి వారికైనా పూనకం వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. గణపతి ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది ఖైరతాబాద్ గణపతి విగ్రహం గురించే.
ఏటా ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా (sri Panchamukha Rudra Maha ganapati) భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కొవిడ్ వల్ల గతేడాది ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించినప్పటికీ... ఈసారి భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఉత్సవ కమిటీ. ఈ ఏడాది గణపతి విగ్రహం ఎత్తును 40 అడుగులకే పరిమితం చేశారు. విగ్రహం తయారీ పూర్తయి.. ముందున్న కర్రలు తొలగించడంతో చవితికి ముందు నుంచే భక్తులు.. గణపతి విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
2019లో మహా గణపతిగా...
గణపతి పండుగ వస్తుందంటే చాలు.. అందరి చూపు ఖైరతాబాద్ గణపతి వైపే. ఏటా ప్రత్యేకమైన అవతారంలో దర్శనమిస్తుంటాడు విఘ్నేశ్వరుడు. 2019లో శ్రీ ద్వాదశదిత్య మహా గణపతి రూపంలో 61 అడుగులు, పది తలలతో సూర్య భగవానుని రూపడై భక్తులకు దర్శనమిచ్చాడు.
2020లో ఉత్సవాలపై కొవిడ్ ప్రభావం
ఏటా భారీ ఖాయంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశునిపై 2020లో కరోనా ప్రభావం పడింది. గతేడాది ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో కేవలం 9 అడుగుల ప్రతిమను ఉత్సవకమిటీ ప్రతిష్ఠించింది. దర్శనానికి భక్తులెవరినీ అనుమతించలేదు.
ఈసారైనా... కరుణించు స్వామి..
వినాయక చవితి దగ్గర పడడం వల్ల బొమ్మల తయారీ దారులు అమ్మకాల్లో నిమగ్నమయ్యారు. గతేడాది కొవిడ్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన బొమ్మల తయారీదారులు... ఈ ఏడాది గణపతి ప్రతిమల అమ్మకాలతో నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున్న బొజ్జ గణపయ్యల ప్రతిమలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల దుకాణాల్లో నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు. వర్షంలో తడుస్తూనే బొమ్మల విక్రయాలు చేపడుతున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ మండపంతో పాటు నగరంలో ఏర్పాటు చేస్తున్న మండపాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణపయ్యను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జగన్ కేసులో కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ.. చివరి అవకాశమన్న కోర్టు