ప్రతి ఏటా ఫిబ్రవరి - మార్చి నెలల్లో జరిగే కేంద్రీయ విద్యాలయాల ప్రవేశ ప్రక్రియ కరోనా లాక్డౌన్ వల్ల ఈసారి జులై - ఆగస్టు నెలలో జరుగుతోంది. కేంద్రీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కనీసం ఐదేళ్లు నిండిన బాలబాలికలకు ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కేటగిరీల వారీగా లాటరీ పద్ధతిన వారికి సీట్లను కేటాయిస్తారు.
ప్రక్రియ ఇలా..!
- ఆగస్టు 7వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణ.
- దరఖాస్తుతో పాటు జనన, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు.. తల్లిదండ్రుల ఉద్యోగ వివరాలు అప్లోడ్ చెయ్యాలి.
- ఆగస్టు 11న లాటరీ పద్ధతిలో తొలి ఎంపిక జాబితా విడుదల.
- ఆగస్టు 24న రెండో జాబితా విడుదల.. ఒకవేళ సీట్లు మిగిలితే 26న మూడో జాబితా విడుదల.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో దాదాపు 160 సీట్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. వీటిలో సగటున ఒక్కో విద్యాలయంలో నాలుగు సెక్షన్ల చొప్పున ఉన్నాయి. ఇందులో 25 శాతం సీట్లను విద్యా హక్కు చట్టం కింద కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణశాఖ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఇలా కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించి ఆయా విభాగాల్లో ఎంపిక కోసం లాటరీ తీస్తారు.
ఖాళీలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ
సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, సింగిల్ గర్ల్ ఛైల్డ్ రిజర్వేషన్లు పాటిస్తారు. ఓబీసీ కోటాను సైతం అనుసరిస్తారు. రెండో తరగతి నుంచి ఉన్న ఖాళీలకు అనుగుణంగా వివిధ తరగతులకు దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా తీసుకుంటారు. ఈ నెల 20 నుంచి 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈనెల 29న ఈ తరగతులకు ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. పదకొండో తరగతికి కూడా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ కమిషనరేట్ ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్ ప్రవేశాల షెడ్యూల్‌ను అమలు చేయనున్నారు.
ఇదీ చూడండి..