జూలై 26 కార్గిల్ విజయ్ దివస్... కోట్లాది మంది భారతీయుల హృదయాలు విజయగర్వంతో, దేశభక్తితో పులకించిపోయే రోజు. దాయాది పాకిస్థాన్‌పై అసామాన్య విజయం సాధించిన సందర్భం. యావత్ భారత పౌరులూ దేశభక్తితో జైజవాన్ అని నినదించే రోజు. పాకిస్థానీ సైన్యాన్ని, వారి కనుసన్నల్లో భరతమాతపై దాడికి వచ్చిన ముష్కరమూకను సైన్యం తోకముడుచుకునేలా చేసిన రోజిది. 1999లో భారత్‌లోకి చొరబడి మంచుకొండలపై మాటు వేసి దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని.. ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టిన అద్భుత ఘట్టం. అలా అసామాన్య రీతిలో కార్గిల్ వేదికగా జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి నేటికి 21ఏళ్లు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను మరోసారి మననం చేస్కోవాల్సిన సమయం. వారి పోరాట పటిమ, త్యాగశీలతనూ స్మరించుకోవాల్సిన సందర్భం.
21 వసంతాలు పూర్తి...
కార్గిల్ యుద్ధం... ప్రస్తావన వస్తే దేశ ప్రజల గుండెలు విజయగర్వంతో ఉప్పొంగటానికి అనేక కారణాలున్నాయి. కార్గిల్ యుద్ధంలో భారత జవాన్లు చూపిన అసమాన పోరాట పటిమ దేశానికి కొత్త శక్తినిచ్చింది. పాక్‌కే కాదు... భారత్ అంటేనే కన్నుకుట్టినట్లు వ్యవహరించే అనేక దేశాలకు గట్టి సందేశాన్నిచ్చింది ఆ విజయం. అటువంటి అమరజవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి ఈ ఏడాదితో 21 వసంతాలు పూర్తి కానుంది.
తొలి అడుగు అక్కడే
హిమాలయ పర్వతాల్లోని గ్రామంలో గొర్రెల కాపరి... తప్పిపోయిన తన గొర్రెను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న గొర్రెల కాపరి వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్ సౌరభ్ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకొని.. వారించే ప్రయత్నం చేయగా... పాక్ సైన్యం, మరికొంత ముష్కరుల సాయంతో వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన.
ముషారఫ్ కుట్ర...
దాయాది నమ్మకద్రోహమే... ఈ యుద్ధానికి కారణంగా చెబుతుంటారు విశ్లేషకులు. భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి హియాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకుని భారత్‌ను దెబ్బతీయాలని పన్నాగం పన్నింది. ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుర్‌తుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్ కుయుక్తులకు తెరతీసింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. రెండు దేశాల మధ్య శాంతి కోసం ‘లాహోర్ ప్రకటన’ చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఈ కుట్రకు తెరదీశారు.
ఆపరేషన్ సఫేద్...
భారత సైనిక శిబిరాల నుంచి వెళ్లాలని పాక్ సైన్యాలను హెచ్చరించినా వారు పట్టించుకోకపోవడంతో.. భారత్ సైనిక చర్య చేపట్టింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో 1999, మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం... శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్.. ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ పేరుతో ఎయిర్‌ఫోర్స్‌ను రంగంలోకి దించింది.
బాంబుల వర్షం
32వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్‌ఫోర్స్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లోనే మూడు యుద్ధ విమానాలు నేలకూలాయి. పరిస్థితులను అంచనా వేసిన వాయుసేన... మిరాజ్-2000 యుద్ధవిమానాల ద్వారా శత్రవులపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం వరుస దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.
భారత సైనికుల పోరాట పటిమతో హిమాలయ పర్వతాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా, 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 3వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. దేశం కోసం పోరాడిన అమర జవాన్లను స్మరించుకుంటుంది.
ఇదీ చదవండీ... చెట్టు కింద శాసనసభ సమావేశాలు