రాజ్యసభలో రాష్ట్రపతికి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మాట్లాడిన కనకమేడల రాష్ట్ర పరిస్థితులను వివరించారు.' అమరావతిలో 415 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని అమరావతి తరలింపునకు నిరసనగా వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏపీ రాజధానికి స్వయంగా ప్రధానమంత్రే శంకుస్థాపన చేశారు. అమరావతిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 10వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత...నిర్మాణ పనులతోపాటు అమరావతి ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసింది. రాజధానికి భూములిచ్చిన రైతుల గోడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. రైతుల నిరసనను పరిగణలోకి తీసుకుని వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను' అని అన్నారు.
రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరం పనులు ముందుకు సాగకుండా రాష్ట్రప్రభుత్వం కాలయాపన చేస్తోందని కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో కనకమేడల ప్రసంగించారు. పోలవరంపై రాష్ట్రప్రభుత్వం శ్రద్ధ కనబరచడం లేదన్న రవీంద్ర.. కేంద్రమే సకాలంలో పూర్తిచేయాలని కోరారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్‌గా గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోనే 69 నుంచి 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరం పనులను నిలిపివేసింది. దీనివల్ల ఏడాది కాలం వృథా అవ్వడమే గాక.. రైతులు ఒక పంటను కోల్పోయారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరచడం లేదు. కేంద్రం ఈ విషయంలో కలుగజేసుకుని నిధులివ్వడమే గాక.. కాలపరిమితిలోగా పూర్తిచేయాలని ఏపీ ప్రజలు, రైతులు కోరుతున్నారు.-ఎంపీ కనకమేడల
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతోందన్నారు.
రాష్ట్రంలో చాలా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఇచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్నాభిన్నమైంది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైదంటే..కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే లక్షా 46 కోట్లు అప్పు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. తప్పుడు కేసులతో వేధిస్తోంది. -ఎంపీ కనకమేడల
ఇదీ చదవండి ; ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ