రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసి రైతు ఆత్మహత్యలు నివారించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ఏడాది పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో రైతులు పండించిన పంటలను అరకొరగా కొనుగోలు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశారని విమర్శించారు. రబీలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగగా.. కరోనా సమయంలో కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు.
మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు.. రైతులు తీసుకెళ్లే కూరగాయల వాహనాలకు అడ్డురావడం దౌర్భాగ్యకరమని కళా వెంకట్రావు దుయ్యబట్టారు. ఆక్వా, సెరీ కల్చర్ రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని విచారం వ్యక్తం చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం'