వైకాపా ప్రభుత్వం తెలుగు భాషకు, తెలుగు సంసృతికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు మాతృభాషకు పెద్దపీట వేయడంలో పోటీ పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలుగును నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తెలుగు భాషను, తెలుగు అకాడమినీ పట్టించుకోకుండా తెలుగుకు తెగులు పట్టిస్తున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమిలో నిధులు 43 కోట్లు ఎలా మాయమయ్యాయని ప్రశ్నించారు. మాతృభాష నిధుల్లో అవినీతికి పాల్పడటమంటే అంటే ఆ భాషను మాట్లాడుతున్న కోట్లాది మంది మనోభావాలకు, భావోద్వేగాలకు, అభివృద్ధికి ద్రోహం చేసినట్లేనని స్పష్టం చేశారు.
ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి 43 కోట్లు కొట్టేసిన దొంగలెవరో, అందుకు సహకరించిందెవరో తేలాలని అన్నారు. దేశ భాషల్లోనే కాకుండా ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాషగా, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు భాష.. జగన్ ప్రభుత్వం వచ్చాకే నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. తెలుగు మీడియం రద్దు చేయాలని ప్రయత్నించారు కానీ కోర్టులు మొట్టికాయలు వేయటంతో వెనక్కి తగ్గారన్నారు. తెలుగు అకాడమీ పేరు మార్చడం జగన్ రెడ్డి భావ దరిద్రానికి నిదర్శనమన్నారు. సీఎంకు తెలుగు భాష గౌరవం, గొప్పతనం తెలియకపోవడం తెలుగు ప్రజల దురదృష్టమని అన్నారు.
ఇదీ చదవండి: navali barrage: నావలి బ్యారేజీ నిర్మాణానికి ఏపీ ససేమిరా