IT employee Success in Snacks business: పండుగలొచ్చినా, చుట్టాలొచ్చినా ఇంటిల్లిపాది చేసుకునే పిండి వంటలు రానురాను తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలతో బిజీ అయ్యే నగరవాసులు.. పిండివంటలు చేసుకోవటం చాలా అరుదు. రిటైల్ స్టోర్లు, స్పెషల్ ఔట్ లెట్లలో కొనుక్కుని సరిపెట్టుకనే ఔత్సాహికుల కోసం.. ప్రత్యేకంగా మీకోసమే తయారు చేసిన పిండివంటలను మీ ఇంటివద్దకే అందిస్తామంటూ ప్రత్యేకత చాటుతున్నారు హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్. ఈ వ్యాపారం కోసం రెండు దశాబ్దాల పాటు మంచి జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. టీ స్నాక్స్ పేరుతో ఏడాదిన్నర కింద వ్యాపారాన్ని మొదలు పెట్టి.. పదిమంది మహిళలకు ఉపాధినందిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆహార పరిశ్రమపై ఉన్న పట్టుతో...
Snacks business: కూకట్‌పల్లికి చెందిన రాజేంద్రప్రసాద్ టాప్ ఐటీ కంపెనీలో మంచి వేతనంతో పనిచేస్తుండేవాడు. కానీ ఎక్కడో ఏదో వెలితి. స్వతహాగా ఆహార పరిశ్రమపై పట్టు ఉన్న ఆయన.. సొంతంగా వ్యాపారం పెట్టి నలుగురికి ఉపాధి అందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ప్రగతినగర్‌లో ఒక క్లౌడ్ కిచెన్‌ను అద్దెకు తీసుకొని.. టీస్నాక్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. పిండివంటలు, కారపు పొడులు, పచ్చళ్లు వంటి వాటిని... అందులో సిద్ధహస్తులైన మహిళలతో చేయించి అమ్మకాలు జరుపుతున్నారు. ఆర్డర్లపై వీటిని తయారు చేసి డెలివరీ చేస్తున్నారు. మౌత్ పబ్లిసిటీతో క్రమంగా వ్యాపారం ఊపందుకుంది. ఇలా హైదరాబాద్‌తో పాటు.. బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ వంటి మెట్రోనగరాలకు... యూఎస్, కెనడా, దుబాయ్ వంటి విదేశాలకు సైతం తన పిండి వంటలను కొరియర్ చేస్తున్నారు.
నాణ్యతలో రాజీ పడం...
IT employee Success Story నాణ్యతలో ఎక్కడా రాజీ పడమని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆర్డర్ మేరకే వంటకాలు చేయటం వల్ల తమ ఉత్పత్తులు ఎల్లవేళలా ఫ్రెష్‌గా ఉంటాయని తెలిపారు. చకినాలు, బిళ్లవక్కలు, కారపూస, రిబ్బెన్ పకోడి, గారెప్ప, అరిసెలు, గవ్వలు, చుడ్వా, సర్వప్ప.. ఇలా 45 రకాల వంటకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వాట్సప్ ద్వారా ఆర్డర్లు తీసుకొని థర్డ్ పార్టీ డెలివరీ ప్లాట్ ఫామ్స్ ద్వారా కొనుగోలుదారుల ఇళ్లకు డెలివరీ చేస్తున్నామని తెలిపారు. వీటి తయారీకి సాధారణ గృహిణులనే తమ ఉద్యోగులుగా ఎంచుకున్నాట్లు పేర్కొన్నారు.
హల్దీరామ్ తరహాలో ముందుకెళ్తాం...
ప్రస్తుతం టీస్నాక్స్ ద్వారా ఆర్డర్లపై పిండి వంటలు సరఫరా చేస్తున్న తాము.. త్వరలో గచ్చిబౌలిలో ఒక ఔట్లెట్ ఏర్పాటు చేసి.. రిటైల్ మార్కెట్లోకి అడుగు పెడతామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత క్రమంగా ఫ్రాంచైజీలు పెంచుకుంటూ.. హల్దీరామ్ తరహాలో ముందుకెళ్తామని భరోసా వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక జంక్‌ఫుడ్ తింటున్నారు. వారికి అమ్మమ్మలు నాయనమ్మలు చేసే పిండి వంటకాలు చేసిపెడితే బాగుంటుంది కాదా అనే ఆలోచనతో నేను ఈ వ్యాపారం ప్రారంభించాను. నాణ్యతలో రుచికరమైన వంటలను పిల్లలు ఇష్టపడుతారు. కానీ ప్రస్తుతతరం వారికి పిండివంటలు ఎక్కువగా తెలియదు. వారిని దృష్టిలో పెట్టుకుని టీస్నాక్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. - రాజేంద్రప్రసాద్
ఇదీ చదవండి: Physically challenged people: సంకల్పం ముందు.. చిన్నబోయిన వైకల్యం!