పిల్లల భవిష్యత్ దృష్ట్యా.. తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలతో పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న కరోనా కేసులు. టీకా అందుబాటులోకి రావటం, రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి దాదాపు తగ్గుముఖం పట్టడమే కాక అధికారులు, పాఠశాల నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. భరోసా ఇవ్వటంతో ధైర్యం చేసి బడికి పంపించారు. ఇప్పుడు మళ్లీ భయం మొదలైంది. వసతి గృహాల్ని కరోనాభయం వెంటాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ వసతి గృహాల్లోని పర్యవేక్షణా లోపం కారణంగానే అనూహ్య రీతిలో కేసులు బయటపడుతున్నాయని వైద్యులు అంటున్నారు.
శానిటైజర్‌లు లేవు
ప్రధానంగా గురుకులాలు, వసతి గృహాల్లోనే కేసులు రావటానికి సరైన పర్యవేక్షణ లేక పోవడమే కారణంగా తెలుస్తోంది. అక్కడ ఉండే విద్యార్థులు భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు కొందరే ధరిస్తున్నారు. శానిటైజర్ ఊసే లేదు. అధికారులు, నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు పక్కన పెట్టినట్లు కేసుల్ని బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకోవటం లేదు. విద్యార్థులు స్టడీ అవర్స్‌లో మాస్క్‌లు ధరించకపోవటం, తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించకపోవటం వల్ల సమస్య జఠిలం అవుతోంది. భోజన సమయంలోనూ విద్యార్థులు గుమి కూడడం, వంట, వడ్డించేవారు మాస్క్‌లు ధరించని పరిస్థితి వల్ల.. కేసుల పెరుగుదలకు అవకాశం ఇచ్చినట్టైంది. చాలా పాఠశాలలు, వసతి గృహాల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులు, కరోనా వైరస్ నియంత్రణకు శానిటైజర్‌లు అందుబాటులో లేకపోవటం కూడా... వ్యాప్తికి కారణమై ఉంటుందంటున్నారు.. వైద్య నిపుణులు.
33 అంశాలు పాటించాలి
వసతి గృహాల్లో కొవిడ్ నివారణకు 33 అంశాలు పాటించాలని స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుకునేటప్పుడు, భోజన సమయంలో భౌతిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి. ఒకరి వస్తువులు మరొకరు వాడకుండా చూడాలి. కుళాయిలు, టాయిలెట్‌లు నిత్యం శుభ్రపరచాలి. వంట వండి, వడ్డించే వారి వరకు అందరూ మాస్క్‌లు ధరించాలి. బయట వ్యక్తులను వసతి గృహాల్లోకి అనుమతించకూడదు. విద్యార్థులకు తరచూ ఆరోగ్య పరీక్షల వంటి తదితర కీలక అంశాల్ని కచ్చితంగా అమలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇవన్నీ అమలవుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించేది ఎవరు? కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. కొవిడ్ నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాలని... నిబంధనలు పాటించని పర్యవేక్షకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారుల సూచన
క్రమం తప్పకుండా కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కరోనా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌కు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకూ సిద్ధమవుతున్నారు. ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గురుకులాలు, కేజీబీవీ, పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, వసతి గృహాల్లో అన్నిచోట్లా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు సైతం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించేలా, శానిటైజర్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని.. ఇదే సమయంలో త్వరితగతిన సిలబస్ పూర్తి చేయడంపై.. హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల వేదపాఠశాల ఘటనకు సంబంధించి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కరోనా కేసులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కరోనా వైద్యం కోసం 1000 పడకలు అందుబాటులో ఉంచాలని.. స్విమ్స్, రుయా ఆస్పత్రుల డైరెక్టర్లకు సూచించారు.
బడుల వివరాలపై దృష్టి
పాఠశాలలు, గురుకులాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలలను కొనసాగించాలా? లేదా? అనే అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు.. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు కరోనా బారిన పడిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మూతపడిన బడుల వివరాలపై దృష్టి పెట్టారు. మొత్తం 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉండటం, వారి ద్వారా కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కనీసం 6, 7, 8 తరగతులను అయినా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇంటి నుంచే విధులు
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ముంబయిలోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం విద్యా సంస్థలకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం మార్చి 17 నుంచి పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించింది. బోధనా సిబ్బంది ఆన్‌లైన్ తరగతులు ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి :