Linking Voter Id to Aadhar: రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టంగా ఆదేశించింది. ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా గత వారం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో భేటీలోనూ.. అనుసంధాన ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వాములను చేయొద్దని చెప్పారు. కానీ, వాలంటీర్ల ద్వారా సేకరించిన ఆధార్ నెంబర్ల ఆధారంగా బూత్ లెవల్ ఆధికారులు.. ఓటర్లకు తెలియకుండానే అనుసంధానం చేస్తున్నారు.
కాకినాడ, గుంటూరు, నెల్లూరు, ఎన్టీఆర్, విజయనగరం, ఇతర జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. వ్యక్తిగత గోప్యత ప్రమాణాలను అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన 6బీ దరఖాస్తులో వివరాలు నింపాలి. ఆ తర్వాత యజమాని నుంచి సంతకం తీసుకున్న తర్వాతే అనుసంధానానికి బూత్ లెవల్ ఆధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలున్నా, చాలాచోట్ల సరిగా అమలు కావట్లేదు. కుటుంబసభ్యులకు 6బీ దరఖాస్తులూ ఇవ్వడంలేదు. వాలంటీర్ల వద్ద వారికి కేటాయించిన 50 కుటుంబాల వివరాలు ఉండటంతో.. వారిచ్చిన సమాచారంతోనే బూత్ లెవల్ ఆధికారులు ప్రక్రియ ముగిస్తున్నారు.
దరఖాస్తుల్లో కుటుంబసభ్యుల సంతకాలు ఉన్నాయా.. లేవా అన్న వివరాల పర్యవేక్షణను సూపర్‌వైజర్లు వదిలేశారు. ఆధార్‌కార్డు లేకపోతే తగిన ఆధారాలు చూపి ఓటరు కార్డుతో అనుసంధానం చేయాలని కోరేలా.. 6బీ దరఖాస్తులో వివరాల నమోదుకు వీలు కల్పించారు. అది ఎవరికీ తెలియడంలేదు. త్వరత్వరగా అనుసంధానం పూర్తిచేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేయడంతో ఇంటింటికీ వెళ్లలేక వాలంటీర్లపై ఆధారపడ్డామని కొందరు బూత్ లెవల్ ఆధికారులు చెబుతున్నారు. కొందరి వివరాలు నమోదుచేస్తుంటే.. ఇప్పటికే నమోదైనట్లు సిస్టమ్‌లో కనిపిస్తోందని చెబుతున్నారు. వారికి మరోచోట ఓటు ఉండి, అనుసంధానం జరిగినందువల్ల ఇలా వస్తోంది. ఈ అనుసంధానం హడావుడిలో చనిపోయినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తప్పించడంలేదు. కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఫాం-7 ఇస్తేనే చనిపోయిన వారి వివరాలు నమోదుచేయాలన్న నిబంధనలు ఉన్నాయి.
ఇవీ చదవండి: