రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అంతర్జాతీయ యోగాదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంప్రదాయ జీవన విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సాధన చేయాలని పిలుపునిచ్చారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గమని గవర్నర్ వివరించారు.
విశాఖలో తూర్పు నౌకాదళంలో నేవీ సిబ్బంది, అధికారులు యోగాసనాలను వేశారు. యానాంలో ఆయుర్వేద, నేచురోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో యోగాపై అవగాహన కల్పించారు.
విశాఖపట్నంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాత్సవ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను అలవాటు చేసుకుంటే అనేక వ్యాధుల నుంచి సులభంగా బయట పడవచ్చని అభిప్రాయపడ్డారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు.
విశాఖలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళి జీవన విధానానికి యోగా అవసరమని సూచించారు. కర్నూలులో ఆ పార్టీ కార్యకర్తలు యోగాసనాలు వేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీ శుకబ్రహ్మ ఆశ్రమంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు. కడపలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ- చిత్తూరు జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, కమిషనర్ గిరీషా పాల్గొని యోగాసనాలను వేశారు. కొవిడ్ సమయంలో యోగా ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని కమిషనర్ గిరీషా సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కొవిడ్ కేర్ సెంటర్లో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. కరోనా బాధితులు యోగా చేయడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని నిపుణులు సూచించారు. గూడూరులో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో యోగాసనాలను వేశారు. యోగ శిక్షణలో గుర్తింపు పొందిన అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఇద్దరు చిన్నారులు...అతి కష్టమైన యోగాసనాలను అవలీలగా వేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో యోగా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుందని చిన్నారులు చెబుతున్నారు. శారీరక, మానసిక దృఢత్వం, వ్యక్తిత్వ వికాసం యోగాతో సాధ్యమవుతాయన్న గురువులు..ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
యోగాసనాల ద్వారా చక్కటి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తూర్పుగోదావరి జిల్లా.. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. మానేపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. విద్యార్థి దశ నుంచి ఆసనాలు వేయడం ద్వారా మానసిక ఒత్తిడి దూరమై ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Governer: యోగా దినోత్సవం సందర్బంగా పోస్టల్ కవర్ను ఆవిష్కరించిన గవర్నర్