పశువుల పేడ కుప్పగా పేర్చడం.. పసుపు, కుంకమలతో పూజలు చేయడం... నలువైపులా జలంతో నింపిన ఇత్తడి, రాగి చెంబులను ఉంచి కొత్తదారంతో చుట్టి... వాటిమధ్య చెక్కపీట వేసి నల్లటి గొంగళ్లను కప్పుకున్న వధూవరుల నిలబెట్టడం. ఆనక వారి కాళ్లు కడగటం.. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు చేతిల్లోకి కొబ్బరి కుడుకలను ఇవ్వడం... అనంతరం బంధువర్గమంతా అక్షింతలు వేసి దీవించడం... వెరసి తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలు నిర్వహించే పెంటమీద పెళ్లి వేడుక తీరు ఇది.
గోవర్థన్ గోట
ఆదివాసీల జీవన విధానమంతా ప్రకృతి చుట్టే పరిభ్రమిస్తోంది. అందులో గోవర్థన్ గోట పేరిట నిర్వహించే పెంటమీద పెళ్లి వేడుక కూడా ఒకటి. ప్రత్యేకంగా ముహుర్తాలంటూ ఉండని ఆదివాసీల పెళ్లిల్లో ఓ రోజు నిర్ణయించుకొని బంధువర్గం వచ్చేంతవరకు వేచిచూడటం ఆనవాయితీ. ముందుగా వరున్ని ఊరేగించి ఊళ్లోకి ఆహ్వానిస్తారు. అనంతరం వధూవరుల తల్లీతండ్రులకు కొత్త బట్టలు సమర్పించే క్రతువు ప్రారంభమవుతుంది. అనంతరం సంప్రదాయ వాయిద్యాల మధ్య గ్రామ చావడీ దగ్గర ఆవు, పశువుల పేడతో పెంటకుప్పను ఏర్పాటుచేసి ప్రత్యేక పూజులు చేస్తారు. బందువర్గమంతా వచ్చారని నిర్ధారించుకున్న తరువాత వధూవరులను వేర్వేరుగా... డోలు, సన్నాయిలు, పిల్లాపాపల నృత్యాల మధ్య పెంటకుప్పవద్దకు తీసుకొస్తారు. అక్కడ పీటలపై నిలబెట్టి వధువు తరపు బంధువులంతా కాళ్లుకడిగి కన్యాదానం చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన అక్షితలు వధూవరులపై చల్లి పెళ్లి జరిపించడం ఇక్కడ ఆనవాయితీ.
ఆదివాసీల అచంచల విశ్వాసం
పెంటమీద పెళ్లి చేయడం ద్వారా ఆ దంపతుల బంధం నిత్యనూతనంగా వెలుగొందుతుందనేది ఆదివాసీల అచంచల విశ్వాసం. పైగా భార్యను పాడిపరిశ్రమలను వృద్ధి చేసే తల్లిలాంటి ఆవుగాను, సంపదలు ఇచ్చే గృహలక్ష్మీ అనేది వీరి భావన. ప్రకృతి నియమంలో చేను, చెట్టు, పాడిపరిశ్రమ అంతా పెంటతోనే మమేకమై ఉన్నందున ఇలాంటి పద్ధతిలో వివాహం చేయటం ప్రధాన పాత్ర పోషిస్తోంది. పెళ్లిని ఎంత నిష్టతో జరిపిస్తే కుటుంబానికి అంత మంచి జరుగుతుందనే విశ్వాసాన్ని పాదుగొల్పుతోంది.
తెగపెద్దల ఆదేశాలకు అనుగుణంగా
ఆదివాసీగూడెంలో పటేల్, దేవరి అనే తెగపెద్దల ఆదేశాలకు అనుగుణంగా పెళ్లి వేడుక సాగుతుంది. పెళ్లి క్రతువుపూర్తయ్యేంతవరకు గూడెంవాసులంతా ఊళ్లోనే ఉండి... చివరికి సహపంక్తి భోజనాలు చేయాలనే నియమం.. పరస్పరం సహకరించుకోవాలనే అంతర్లీనమైన హితాన్ని చాటిచెబుతోంది. అందరినీ ఏకతాటిపై నడిపించే మంత్రంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా..