రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ).. పారిశ్రామిక పార్కుల్లో భూముల ధరలను సుమారు అయిదు రెట్లు పెంచింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గతంలో ఎకరా రూ.16.5 లక్షలకు కేటాయించిన భూముల ధరను ప్రస్తుతం ఎకరా రూ.80 లక్షలుగా నిర్దేశించింది. పరిశ్రమలను ఆకర్షించటానికి పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరలకే భూములను కేటాయిస్తుంటే.. రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే.. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారిపై భారం పడకుండా ఉండటానికి లీజు ప్రాతిపదికన భూములిస్తామని 2020-23 పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, గతంలో ప్రతిపాదించిన ధరల ప్రకారం విక్రయిస్తే నష్టపోతామని.. కొత్త ధరల ప్రకారం చెల్లించే వారికే విక్రయ ఒప్పందాలను రిజిస్ట్రేషన్ చేస్తామని ఏపీఐఐసీ చెబుతోంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలపై ఎకరాకు రూ.63.5 లక్షల అదనపు భారం పడనుంది. ఈ మొత్తాన్ని చెల్లించటానికి అంగీకరించని వారి
భూముల కేటాయింపును రద్దు చేస్తూ 175 మందికి నోటీసులు పంపింది. నిర్దేశిత వ్యవధిలో పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, విక్రయఒప్పందాలు కుదుర్చుకోవటంలో జాప్యం జరిగిందని నోటీసుల్లో పేర్కొంది. విక్రయ ఒప్పందాలను రిజిస్ట్రేషన్ చేయటంలో ఏపీఐఐసీనే జాప్యం చేసిందని, ఇవి లేకుండా బ్యాంకర్లు రుణాలిచ్చే పరిస్థితి లేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడానికి పరోక్షంగా ఏపీఐఐసీనే కారణమని ఆరోపిస్తున్నారు.
రిజిస్ట్రేషన్‌లో జాప్యం
మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూముల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి తాత్కాలిక కేటాయింపు జాబితాను ఏపీఐఐసీ 2017లో ప్రకటించింది. చదరపు మీటర్‌కు రూ.408 వంతున ధరను అప్పట్లో నిర్దేశించింది. దీని ప్రకారం ఎకరా రూ.16.50 లక్షల వంతున పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. తాత్కాలిక కేటాయింపు జాబితా ప్రకారం 90 రోజుల్లో నిర్దేశిత మొత్తాన్ని ఏపీఐఐసీకి చెల్లించాలి. ఆ తర్వాత 30 రోజుల్లోగా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. దీని కోసం ఏపీఐఐసీ జోనల్ కార్యాలయానికి వెళ్తే.. స్టాంపులను సిద్ధం చేసిన తర్వాత విక్రయ ఒప్పందాన్ని రిజిస్టర్ చేస్తామని చెప్పి పంపారు. ‘స్టాంపు పత్రాలను ఏపీఐఐసీ జోనల్ కార్యాలయంలో అందించాం. పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఉన్నాయని.. దఫాల వారీగా పూర్తి చేస్తామని చెప్పి పంపేశారు. ఇప్పుడేమో 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, నిర్దేశిత వ్యవధిలో పరిశ్రమ ఏర్పాటు చేయలేదంటూ.. భూముల కేటాయింపు రద్దు చేస్తూ నోటీసులిచ్చారు. ఆలస్యమైనా దఫాల వారీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన అధికారులే ఇప్పుడు మాట మార్చి, ఒప్పందాలను రద్దు చేస్తున్నారు. అవే భూములను చదరపు మీటర్‌కు రూ.1,967 వంతున చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. దీని ప్రకారం ఎకరా రూ.80 లక్షల ధరకు కొనాలి’ అని పలువురు పారిశ్రామికవేత్తలు వాపోయారు. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో చదరపు మీటర్ ధరను రూ.2,300కు పెంచాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. గతంలో ప్రతిపాదించిన రూ.1,967 ధరకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు.
ఏపీఐఐసీ ధర.. భారీగా పెంపు
మల్లవల్లి పారిశ్రామిక పార్కును 1,360 ఎకరాల్లో ఏపీఐఐసీ అభివృద్ధి చేసింది. ఇందులో 1,165.73 ఎకరాల్లో మోడల్ ఇండస్ట్రియల్ పార్కును ప్రతిపాదించింది. దీనిలో మొత్తం 612 పరిశ్రమల ఏర్పాటుకు 837 ఎకరాలను కేటాయించింది. సాగులో ఉన్న రైతులకు పరిహారం, అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.465 కోట్లు అవసరమని లెక్కించింది. దీని ప్రకారం ఎకరా రూ.40-45 లక్షల వంతున విక్రయిస్తేనే గిట్టుబాటవుతుందన్నది ఏపీఐఐసీ అధికారుల ఆలోచన. ఇప్పటికే ఉత్పత్తిలోకి వచ్చిన పరిశ్రమలను కూడా కనీసం ఎకరాకు రూ.40 లక్షల వంతున చెల్లించమంటున్నారని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు.
* మల్లవల్లి పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరా రూ.7 లక్షలు. ప్రైవేటు భూములు ఎకరా రూ.30 లక్షల్లో దొరుకుతున్నాయి. ఏపీఐఐసీ మాత్రం ఎకరాకు రూ.80 లక్షల వంతున వసూలు చేస్తోందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సుమారు 750 ఎకరాలను ఉచితంగా తీసుకుని కూడా ఏపీఐఐసీ భారీ మొత్తంలో ధరలు పెంచి వసూలు చేస్తోందని వాపోతున్నారు.
వీరపనేనిగూడెంలో మరో కథ
కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్కులో మొత్తం 59 పరిశ్రమల ఏర్పాటుకు భూమి కేటాయించారు. ఇక్కడా సుమారు 23 మందికి కేటాయించిన భూములను నోటీసులిచ్చి ఏపీఐఐసీ రద్దు చేసింది. వాటిని చదరపు మీటర్ రూ.2,227 వంతున కేటాయించాలని నిర్ణయించింది. అంటే పారిశ్రామికవేత్తలు ఎకరాకు రూ.91 లక్షల వంతున చెల్లించాల్సి వస్తోంది.
ఇదీ చదవండి:
CM Jagan: ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్
SP Reaction: వివేకా కుమార్తె లేఖకు ఎస్పీ స్పందన.. సునీత ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు!