Diesel with 75 percent of water: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్(మలక్‌పేట్ సర్వీస్ స్టేషన్)లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆయిల్ కోసం వచ్చిన కస్టమర్లకు నీరు కలిసిన డీజిల్ నింపడం వల్ల 4 కార్లు, ఒక బోర్ లారీ అక్కడికక్కడే ఆగిపోయాయి. అనుమానం వచ్చిన వాహన యజమానులు... టెస్టింగ్ చేయగా నీటితో కూడిన డీజిల్ పోసినట్లు గుర్తించారు.
ఖరీదైన కార్లకు రిపేర్లు
ఆయిల్లో 75శాతం నీరు, 25 శాతం డీజిల్ ఉండటాన్ని గుర్తించినట్లు కస్టమర్లు చెబుతున్నారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా... నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. తమకు తెలియకుండా కలిసిందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపోద్రిక్తులైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న బంక్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. బంక్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఖరీదైన కార్లు రిపేర్లకు వచ్చాయని వాపోయారు. హైవే పక్కన ఉన్న బంక్‌లో ఇంతటి ఘరానా మోసానికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు పోయినా నాణ్యమైన ఆయిల్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో కారు ట్యాంక్ ఫుల్ చేయించాం. ఇక్కడి వరకు వచ్చిన కారు... డీజిల్ కొట్టించిన తర్వాత స్టార్ట్ కాలేదు. ఏమైందని చెక్ చేస్తే.. ఆయిల్లో సగానికి పైగా వాటర్, మిగతాది డీజిల్ ఉంది. మా లాగే ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా వచ్చి... కారు ఆగిపోయిందని అంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
-బాధితులు
మేం ఆయిల్ కొట్టించాం. అందులో 75 శాతానికిపైగా నీరే ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు క్వాలిటీ చెక్ చేశారు. చాలా వరస్ట్ మెయింటెనెన్స్ ఉంది. శాంపిల్ తీసుకొని పోయారు. ఇంకా రాలేదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-బాధితులు
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో జింకల కళేబరాలు కలకలం