రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామంటూ తక్షణమే ప్రకటించాలన్న డిమాండుతో ప్రవాసాంధ్ర వైద్యుడు డాక్టర్ ఉయ్యూరు లోకేశ్‌బాబు అమెరికాలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఆగ్నేయాసియాలోనే అత్యుత్తమ ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందేదని, దేశానికి, రాష్ట్రానికి లక్ష కోట్ల డాలర్ల సంపదను తెచ్చిపెట్టేదని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం సర్వం త్యాగం చేసి భూములిచ్చిన రైతుల్ని వేధించడం సరికాదని, దాన్ని తాను నిరసిస్తున్నానని చెప్పారు.
అమెరికాలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పనిచేస్తున్న లోకేశ్‌బాబు స్వస్థలం గుంటూరు జిల్లా ముట్లూరు. అమరావతి పరిరక్షణ, వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 13న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు ‘ఈనాడు’ ప్రతినిధికి తెలిపారు. తన డిమాండ్లు, ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి కారణాలను వివరించారు.
ఆయన మాటల్లోనే..
* భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలి. ఇకపై జరిగే ఎన్నికలన్నింటినీ బ్యాలట్ పత్రాలతోనే నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయి. భారత్‌లో 2018 నుంచి 2019 వరకూ జరిగిన ప్రతి ఎన్నికల్లో ఈవీఎంల మోసాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాం. ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ప్రత్యక్షంగా నిరూపిస్తామని చెప్పాము. రాష్ట్రపతికీ ఫిర్యాదు చేశాం. అయినా వాటికి అతీగతీ లేదు.
* ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట దోపిడీకి తెరలేపింది. అమరావతి కోసం భూములిచ్చి, రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రైతుల్ని హేళన చేస్తోంది. ఇది హేయం
* ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున మతమార్పిళ్లు, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా సీబీఐతో విచారణ జరిపించాలి.
ఇదీ చదవండి:
కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం