రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ ప్రధాన ఖనిజ (మేజర్ మినరల్) నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించగా.. అందులో బంగారం, వజ్రాలు లభించే ప్రాంతాలు ఉన్నట్లు తెలిసింది. ఇపుడు ఆయా బ్లాక్‌లను కేంద్ర గనులశాఖ రాష్ట్రానికి అప్పగించనుంది. దేశ వ్యాప్తంగా జీఎస్‌ఐ వివిధ ప్రాంతాల్లో ఖనిజ నిల్వలకు సంబంధించి సర్వే చేసింది. బొగ్గు, ఇనుము, బంగారం, వజ్రాలు వంటి ఖనిజాలకు సంబంధించి 100 బ్లాక్‌లను ఎంపిక చేసింది. బుధవారం దిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయా రాష్ట్రాలకు ఈ బ్లాక్‌లను అప్పగించనున్నారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన బ్లాక్‌లు ఆరు నుంచి ఎనిమిది వరకు ఉన్నట్లు తెలిసింది.
రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలో బంగారం నిల్వలపై జీఎస్‌ఐ పరిశోధనలు చేసింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం, కర్నూలు జిల్లా జొన్నగిరి, అనంతపురం జిల్లా రామగిరిలో బంగారం గనులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని పలు చోట్ల బంగారం నిల్వలను జీఎస్‌ఐ గుర్తించింది. అలాగే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ సమీపంలోని.. పెన్నా అహోబిళం వద్ద వజ్రాల నిల్వలు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ఇటువంటి బ్లాక్‌లను రాష్ట్రానికి అప్పగించనున్నారు.
గతంలో జీఎస్‌ఐ, కేంద్ర గనులశాఖ ప్రధాన ఖనిజాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత వేలం ద్వారా లీజులు కేటాయించేవారు. కొత్త విధానం ప్రకారం.. వేలంలో లీజు పొందినవారే ఖనిజాన్వేషణ చేసి, పూర్తిస్థాయిలో నిర్ధారణ చేసుకున్నతరవాత తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ..