మూడు జిల్లాల కలెక్టర్లు సహా పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. కొత్తగా సృష్టించిన సంయుక్త కలెక్టర్ (గృహ నిర్మాణం) పోస్టుల్లో 13 జిల్లాలకు జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ 13 మందిలో 9మంది 2018, ముగ్గురు 2017, ఒకరు 2016 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారులున్నారు. వీరంతా ప్రస్తుతం వివిధ జిల్లాల్లో సబ్‌కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. కృష్ణా, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.ఎండి.ఇంతియాజ్ మైనారిటీల సంక్షేమ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయనకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని అప్పీల్స్ డైరెక్టర్ పోస్టుని పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్‌ని కృష్ణాజిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఏపీ ఆగ్రోస్ వైస్‌ఛైర్మన్, ఎండీగా పనిచేస్తున్న లత్కర్ శ్రీకేష్ బాలాజీరావును శ్రీకాకుళం కలెక్టర్‌గా నియమించింది. అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడిని బదిలీ చేసి, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా నియమించింది. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎస్.నాగలక్ష్మిని అనంతపురం కలెక్టర్‌గా నియమించింది. గూడూరు సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణ రోణంకిని విశాఖ జిల్లాలోని పాడేరు ఐటీడీఏ పీవోగా నియమించింది. సహకారశాఖలో అదనపు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఎస్.కృష్ణమూర్తిని ఏపీ ఆగ్రోస్ వీసీ, ఎండీగా నియమించింది.
ఇదీ చదవండి