హైదరాబాద్‌కు చెందిన పానుగంటి శ్రీధర్(39)... అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీధర్‌కు భార్య, ఐదేళ్ల కొడుకున్నారు. ఉద్యోగరిత్యా శ్రీధర్ న్యూయార్క్‌లో నివాసముండగా... భార్య, కొడుకు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్వాస తీసుకోవటంలో కొంత ఇబ్బంది పడిన శ్రీధర్... ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు తనకు ఆస్తమా ఉన్నట్లు నిర్ధరించి... మెడిసిన్ ఇచ్చారు. నాలుగు రోజుల పాటు మందులు వాడిన శ్రీధర్... అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు కుటుంబసభ్యులకు వివరించారు.
నవంబర్ 26 రోజు రాత్రి సైతం కుటుంబసభ్యులందరితో సరదాగా ఫోన్లో మాట్లాడి పడుకున్న శ్రీధర్... తర్వాతి రోజు పొద్దున భార్య చేసిన ఫోన్‌కి స్పందించలేదు. అనుమానమొచ్చిన కుటుంబసభ్యులు అక్కడే ఉన్న స్నేహితులకు సమాచారమివ్వగా... శ్రీధర్ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలిసింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని వెల్లడించారు. మృతదేహాన్ని మరింత లోతుగా పరిశీలించాలని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో... పరీక్షలకు ఆరు నెలలు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
మరోవైపు శ్రీధర్ మృతి వార్త విని కుటుంబసభ్యులు హతాశులయ్యారు. ఎలా మరణించాడో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో కన్నీరుమున్నీరయ్యారు. నవంబర్ 27న మరణించిన శ్రీధర్ మృతదేహాం కోసం కళ్ల నిండా కన్నీళ్లతో నిరీక్షిస్తున్నారు. మృతదేహాన్ని వెంటనే భారత్ రప్పించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినా... సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాంగ శాఖను, మంత్రి కేటీఆర్‌ను కుటుంబసభ్యులు సాయం కోరారు. పరీక్షలకు ఆరు నెలలు పడుతుందని అమెరికా అధికారులు తెలపగా... కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.