తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ ఉపఎన్నిక(huzurabad bypoll 2021)లో తెరాస నేతలు ఎన్నో కుట్రలు చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender Comments) ఆరోపించారు. ఉపఎన్నిక సందర్భంగా రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని అభిప్రాయపడ్డారు. పెద్దఎత్తున మద్యం పంపకాలతో ప్రలోభ పెట్టారని... ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. కుల పరంగా చిచ్చు పెట్టినా ప్రజలు తలొగ్గలేదని వెల్లడించారు. భాజపా నేతలు తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యం చేసేందుకు అన్ని వర్గాలు పనిచేశాయని తెలిపారు. భాజపా సీనియర్ నాయకులు వచ్చి ప్రచారం చేశారని చెప్పారు. ఈటల గెలిస్తే అందరూ గెలిచినట్లే భావించారని సంతోషం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను కదిలించారని వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలో భాజపా కార్యకర్తలు(bjp) పులిబిడ్డల్లా పనిచేశారని పేర్కొన్నారు. ప్రచారంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపును వారి గెలుపుగా భావించి అందరూ దీపావళి చేసుకున్నారన్నారు. ఉపఎన్నిక కోసమే 6 నెలలుగా అధికార యంత్రాంగం పనిచేసిందని విమర్శించారు. నిర్బంధాలు పెట్టి రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఈటలను ఓడించడమే అజెండాగా పెట్టుకున్నారని అన్నారు. కుల సంఘాలు, భవనాలు, గుడులకు డబ్బులిచ్చారన్నారు. దళిత బంధు పథకం పెట్టినా ప్రజలు తనను గెలిపించారని స్పష్టం చేశారు.
కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయం ఇదని తెలిపారు. హుజురాబాద్ గడ్డపై ఉన్న అన్ని సంఘాలు అండగా నిలిచారన్నారు. ఓటు వేయకపోతే దళిత బంధు పథకం నిలిపివేస్తామని బెదిరించినట్లు తెలిపారు. పింఛన్లు నిలిచిపోతాయని వృద్ధులను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు చేసేవారు ఆ కుట్రలకే బలవుతారని ఎద్దేవా చేశారు.
ఈటల రాజేందర్ (Etela Rajender )ఎప్పుడూ పార్టీలు మారే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తెరాస నేతలు వెళ్లగొడితే భాజపా అక్కున చేర్చుకుందని తెలిపారు. పార్టీలో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తి ఈటల అన్నారు. 18 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడ్డామన్నారు. వెన్నుపోటు పొడిచి వెళ్లినట్లు తనపై ఆరోపణలు చేశారని వివరించారు.
''వెన్నుపోటు పొడిచి.. పార్టీ నుంచి వెళ్లగొట్టింది కేసీఆర్. నా చరిత్ర తెరిచిన పుస్తకంలా దేశం ముందుంది. ఎన్ని జన్మలు ఎత్తినా హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేను. హుజురాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటా... హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తా... విజయాన్ని హుజురాబాద్ ప్రజలకు అంకితం చేస్తున్నా...''
-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
- ఇదీ చూడండి: