తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేసిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు మార్గం సుగమమవుతోంది. డిసెంబర్ వరకు గడువు ఉన్నా.. అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలోగా ఇతర రాష్ట్రాల నియోజకవర్గాలతో కలిపి హుజూరాబాద్ ఉపఎన్నికను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నికల నిర్వహణా సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. ఈసీ సెక్రటరీ జనరల్ ఉమేశ్ సిన్హా నిర్వహించిన సమీక్షకు బీఆర్కే భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణా సాధ్యాసాధ్యాలపై ఈసీ అధికారులతో సమీక్షించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, ఇతరత్రా ఏర్పాట్లు, అంశాలపై ఆరా తీసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, మూడో వేవ్ ప్రభావం అంచనా తదితరాలను అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించారు. నవంబర్లో ఎన్నికలు నిర్వహణకు పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు సమాచారం. అటు ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంల లభ్యత, ఓటర్ల జాబితా సహా ఇతరత్రా అంశాలపై కూడా ఈసీ సమీక్షించింది.
వేడెక్కిన రాజకీయం
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జూన్లో రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కరోనా అదుపులో ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు త్వరలో తెర లేవనుంది. అక్కడ ఇప్పటికే తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. తెరాస నుంచి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. జి.శ్రీనివాస్ యాదవ్ పేరును తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది.
6 శాసనమండలి స్థానాలకూ..
శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడికుంటి వెంకటేశ్వర్లు, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలితల పదవీకాలం జూన్లో ముగియడంతో ఆ ఆరు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా మండలిలో స్థానాలు ఖాళీ కాగానే, ఎన్నికలను పూర్తి చేయడం ఆనవాయితీగా ఉంది. కరోనా వల్ల ఎన్నికలు నిర్వహించలేదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం కోరగా.. పరిస్థితులు అనుకూలంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బదులిచ్చింది. ఇప్పుడు పరిస్థితులు సానుకూలం కావడంతో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: YSR VARDHANTHI: ఇడుపులపాయలో వైఎస్ఆర్కు సీఎం జగన్, కుటుంబసభ్యుల నివాళి