తెలంగాణలో బేగంపేటలోని ఓ అంతర్జాతీయ కొరియర్ కార్యాలయంలో.... పోలీసులు తనిఖీ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్‌ను విప్పి చూశారు. ఫోటో ఫ్రేమ్‌ల లోపల నిషేధిత డ్రగ్స్‌ను ప్యాకింగ్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా సూడోఎఫిడ్రిన్ (Pseudoephedrine) అనే డ్రగ్స్‌ను... ఫోటో ఫ్రేమ్‌ల మధ్య కవర్‌లో అమర్చి ఆస్ట్రేలియాకు కొరియర్ చేశారు. బేగంపేట పోలీసులు వెంటనే డీఆర్ఐ అధికారులకు సమాచారమిచ్చారు. డీఆర్ఐ అధికారులు కొరియర్ కార్యాలయానికి చేరుకొని.. వివరాలు సేకరించారు. నిషేధిత డ్రగ్స్‌ను పార్శిల్ చేసిన వ్యక్తి.. నకిలీ ఆధార్ కార్డు సమర్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది (fake identity). ఆధార్ చిరునామా ప్రకారం తమిళనాడులో సంప్రదించగా.. తప్పుడు అడ్రస్‌గా తేలింది. దీంతో పోలీసులు కొరియర్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు.. నిందితుడి చరవాణి ఆధారంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజుల కిందట... ఎన్సీబీ అధికారులు అబిడ్స్‌లోని కొరియర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి... 3 కిలోల సూడోఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చీరలను ప్యాకింగ్ చేసి... ఆస్ట్రేలియా చిరునామాతో పార్సిల్ చేశాడు. చీరల ఫాల్స్ లోపల సూడోఎఫిడ్రిన్‌ను ఉంచాడు. పార్సిల్ చేసిన వ్యక్తి తప్పుడు చిరునామాను సమర్పించాడు. చెన్నై ఎన్సీబీ అధికారులు... రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేశారు.
ఇతర దేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, మలేషియా దేశాల్లో... కొన్ని రకాల మాదక ద్రవ్యాలను ఎఫిడ్రిన్ ఉపయోగించి తయారు చేస్తారు (drugs trafficking from Hyderabad). దీంతో అక్కడ ఎఫిడ్రిన్, సూడొఎఫిడ్రిన్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇక్కడ 50వేల రూపాయల విలువ చేసే ఎఫిడ్రిన్... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 5లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఎఫిడ్రిన్‌ను తయారు చేసే పరిశ్రమలు ఆయా దేశాల్లో ఎక్కువగా లేకపోవడంతో... దిగుమతిపై ఆధారపడుతున్నారు.
భాగ్యనగరం అడ్డాగా..
దేశంలో హైదరాబాద్ ఔషధ పరిశ్రమల పరంగా ఎంతో పేరు గడించింది. ఇక్కడ జీడిమెట్ల, పటాన్ చెరు, పాశమైలారం.. అమీన్‌పూర్, మైలార్‌దేవ్‌పల్లి, కూకట్ పల్లిలోని పారిశ్రామికవాడల్లో అనేక ఔషధ పరిశ్రమలున్నాయి. మూతపడిన కొన్ని పరిశ్రమల్లో.. గుట్టు చప్పుడు కాకుండా ఎఫిడ్రిన్‌ను (Ephedrine) తయారు చేస్తున్నారు. వీటిని పలు ప్యాకింగ్‌ల రూపంలో విదేశాలకు తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది స్మగ్లర్లు కొరియర్ కార్యాలయాల్లో... పార్సిల్ చేస్తుండగా.. మరికొంత మంది విమానాల్లో తీసుకెళ్తున్నారు. మరికొందరు సముద్రమార్గంలో తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో తయారు చేసిన ఎఫిడ్రిన్‌ను... చెన్నె, బెంగళూరు, కేరళ, మహారాష్ట్రకు తరలించి... అక్కడి నుంచి పలు మార్గాల్లో విదేశాలకు తరలిస్తున్నారు. డీఆర్ఐ హైదరాబాద్ శాఖ అధికారులే... 15 కేసులకు పైగా నమోదు చేసి 300 కిలోలకుపైగా ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ అధికారుల దాడుల్లోనూ (ncb raids) ఎఫిడ్రిన్ పట్టుబడుతోంది.
అక్కడ గట్టి నిఘా పెట్టాలి..
కొరియర్ కార్యాలయాలపై (parcel courier offices) గట్టి నిఘా పెడితే... విదేశాలకు అక్రమంగా తరలించే ఎఫిడ్రిన్, సూడోఎఫిడ్రిన్‌ను పట్టుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ చూడండి: TRS dharna: తెరాస ధర్నా ఏర్పాట్లలో అపశృతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి