Homegaurd Rape on RTA Employee: మృగాళ్లు రెచ్చిపోతున్నారు... నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా రవాణాశాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన అదే శాఖకు చెందిన హోంగార్డు కటకటాల వెనక్కి వెళ్లాడు. నాలుగేళ్ల కిందట ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. వీడియో తీసి.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. తరచూ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా డబ్బులు తీసుకుంటున్నాడు. ఆ హింసను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగిని భర్తతో విడిపోయారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఆ ఉద్యోగినిని ఖమ్మంలోని రవాణాశాఖ కార్యాలయానికి 2018లో ఉన్నతాధికారులు బదిలీ చేశారు. తల్లి, పిల్లలలో అక్కడి రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లగా.. హోంగార్డుగా పనిచేస్తున్న స్వామి పరిచయమై, ఇల్లు చూపించడంతో పాటు పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించాడు. కొద్దిరోజుల్లోనే ఆ కుటుంబానికి ఆపద్బంధుగా మారాడు. దీంతో ఆమె తన కుటుంబ విషయాలు హోంగార్డుతో పంచుకున్నారు. ఒకరోజు ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండగా, ఓ జ్యూస్‌ను శక్తినిస్తుందని చెప్పి తాగించాడు.
ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో అత్యాచారానికి పాల్పడి వీడియోలు, ఫొటోలు తీశాడు. మరుసటిరోజు నుంచి వాటిని చూపించి బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడటంతో పాటు డబ్బులు తీసుకొనేవాడు. ఈ ఏడాది జనవరిలో ఆమె హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. కొద్దిరోజులు మౌనంగా ఉన్న నిందితుడు మళ్లీ వేధించసాగాడు. రాత్రివేళ వీడియో కాల్ చేసి నగ్నంగా మాట్లాడాలని కోరి రికార్డు చేసేవాడు. దీంతో బాధితురాలు అతడి మొబైల్ నంబరును బ్లాక్ చేశారు.
రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని కార్యాలయానికి వచ్చి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో బాధితురాలు, తన తల్లి.., నిందితుడి భార్యకు విషయం వివరించారు. మరింత కక్ష పెంచుకొన్న స్వామి.. బాధితురాలు వదిలేసిన భర్త, అత్తమామలకు వీడియోలను పంపించి డబ్బులు ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ చెప్పాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు ఈనెల 22న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ 376, 354డీ,506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి..