విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో నిర్ణయించిన సౌర విద్యుత్ యూనిట్ ధరపై పునఃసమీక్షలో భాగంగా... ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఓ ప్రైవేట్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) జారీచేసిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63ని అనుసరించి పారదర్శక పద్ధతిలో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా నిర్ణయించిన ధరను...సెక్షన్ 62ను అనుసరించి మరోసారి ఏవిధంగా మారుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మేరకు ఏపీ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చీఫ్ ఇంజినీర్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.అప్పీల్‌పై విచారణను డిసెంబర్ 10కు వాయిదా వేసింది.
సంస్థ వాదనలు
టారిఫ్‌ను ఏపీఈఆర్సీ నిర్ణయించాలని, యూనిట్ ధర 2 రూపాయల 44పైసలు చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలపై... అభ్యంతరం వ్యక్తం చేస్తూ వానీప్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఆ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది సజన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ... బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఓ సారి యూనిట్ ధర ఖరారు అయ్యాక మరోసారి ధరను నిర్ణయించే అధికారం ఏపీఈఆర్సీకి లేదన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాల సేకరణ, సలహాల కోసం డిసెంబర్ 7న బహిరంగ విచారణ నిర్వహించేందుకు ఏపీఈఆర్సీ నోటీసు జారీచేసిందన్నారు.
ప్రభుత్వ వాదనలు
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.... టారిఫ్ పన్ను పునఃమదింపు చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరన్నారు. పీపీఏల ఒప్పందం జరిగేనాటికి బిడ్డింగ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేయలేదని పేర్కొన్నారు. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62ను అనుసరించి విద్యుత్ యూనిట్ ధరను నిర్ణయించే అధికారం ఏపీఈఆర్సీకి ఉందన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ... హడావుడిగా పబ్లిక్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. సెక్షన్ 63ని అనుసరించి ఓపెన్ బిడ్డింగ్‌లో ఖరారు చేసిన ధరను... సెక్షన్ 62ని అనుసరించి మరోమారు నిర్ణయించడం ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది. సౌర విద్యుత్ యూనిట్ ధర ఖరారు విషయంలో డిసెంబర్ 1న పబ్లిక్ హియరింగ్ చేపట్టేందుకు ఏపీఈఆర్సీ ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది.
ఇదీ చూడండి: పెన్నా, ఎంబసీ ఆస్తుల జప్తుపై యథాతథస్థితి