ఇళ్ల స్థలాల కోసం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూముల్ని బలవంతంగా తీసుకోవడాన్ని నిలువరించాలని కోరుతూ... కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి మల్యాద్రి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు భూసమీకరణ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమకు అందిన లేఖతో జత చేసిన ఫోటోలు చూస్తుంటే బలవంతపు భూ సమీకరణకు జేసీబీలు తెచ్చినట్లున్నారని వ్యాఖ్యానించింది. చెట్లు కొట్టేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని... అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది.
ఇదేం పద్దతి..?
గతంలో ఒకరికి ఇచ్చిన భూమిని తీసుకొని తిరిగి ఇంకొకరికి ఎలా ఇస్తారని... అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని మరొకరికి ఇవ్వడం ఏం పద్ధతి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయటం తగదని హితవు పలికింది. భూములను వెనక్కి తీసుకునేందుకు పరిహారం చెల్లిస్తున్నామని... విశాఖ జిల్లాలో తీసుకుంటున్న అసైన్డ్ భూములు చాలా వరకు యజమానుల అంగీకారంతోనే తీసుకుంటున్నట్లు ఏజీ వివరించారు. ఎంతమందికి పరిహారం చెల్లించారో తీసుకున్న భూములకు సంబంధించిన అడంగల్ రికార్డులను తమ ముందు ఉంచాలని ఏజీని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం వద్దు..
విశాఖ జిల్లాలోని దొండపూడిలో తమకు చెందిన వ్యవసాయ భూమిలో రావికమతం మండల తహసీల్దార్ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ... 74మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం రెవెన్యూ , పోలీసు అధికారుల తీరును తప్పుబట్టింది. పంటను ధ్వంసం చేస్తున్నట్లు ఫొటోల్లో కనిపిస్తోందని... పోలీసుల సహకారంతో భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీవ్రమైన నేరం జరిగితే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లాలని.. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం వద్దని గతంలో ఆదేశాలున్నాయని ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. పోలీసుల తీరు ఇలా ఉంది కాబట్టే మిమ్మలి కోర్టుకు పిలిపించామని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
పోలీసు చర్యలను అడ్వొకేట్ జనరల్ సమర్ధించే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం... కోర్టులో చెప్పేది వేరు, క్షేత్రస్థాయిలో జరుగుతోంది వేరని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు ఇలాగే కొనసాగితే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని... ఆ తర్వాత వ్యవహారం వారే చూసుకుంటారని వ్యాఖ్యానించింది. రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్లు తారుమారు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాధ్యులైన అధికారులపై చర్యలకు ఆదేశిస్తాం
అధికారులే రికార్డులను తారుమారు చేయడమంటే వ్యవస్థను అవహేళన చేయడమేనని... అలాంటి వారిపై ఐపీసీ 467, 468 సెక్షన్ల కింద కేసులు పెట్టాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో నిబంధనలు అమలవుతున్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని తీవ్రంగా హెచ్చరించింది.
విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం సుమారు 6వేల ఎకరాల అసైన్డ్ భూములు నిబంధనలకు విరుద్ధంగా సమీకరిస్తున్నారంటూ... దాఖలైన పిల్‌పైనా త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. భూ సమీకరణకు అనుసరించాల్సిన విధానాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని.. 30రోజుల ముందస్తు నోటీసు ఇవ్వలేదని... పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం హడావుడిగా భూములెందుకు సమీకరిస్తున్నారని ఏజీని ప్రశ్నించింది. ఎన్నికల ప్రకటన జారీ అయినందున ఇళ్ల స్థలాలు కేటాయించొద్దని ఏజీకి సూచించింది.