అచ్చెన్నాయుడిని విజయవాడ, గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించే అంశంపై వాదనలు విన్న ధర్మాసనం.. గుంటూరులోని ఓ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విజయవాడ జిల్లా జైలు సుపరింటెండెంట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అచ్చెన్నాయుడికి ఇటీవలే శస్త్రచికిత్స జరిగిందనీ... ఆ వెంటనే ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారని మాజీ మంత్రి తరఫు న్యాయవాది వాదించారు. దీని వలన ఆరోగ్యం క్షీణించిందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగానే హఠాత్తుగా డిశ్ఛార్జి చేశారని కోర్టుకు తెలిపారు. పూర్తి రిపోర్టులు రాకుండానే ఆసుపత్రి నుంచి జైలుకు తరలించారని వాదనలు వినిపించారు.
అచ్చెన్నాయుడి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వమని న్యాయస్థానాన్ని కోరారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ సమర్పించిన అనంతరం విచారణ జరిపి.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని హై కోర్టు ఆదేశించింది. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి నేడు అచ్చెన్నాయుడిని తరలించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: విశాఖ మూడోపట్టణ పీఎస్కు ఎల్‌జీ పాలిమర్స్ కేసు నిందితులు